సిటీబ్యూరో, డిసెంబర్ 21 (నమస్తే తెలంగాణ): హత్యలు, దోపిడీలు, దొంగతనాలు వంటి నేరాలతో హైదరాబాద్ నగరం అట్టుడుకుతున్నది. శాంతి భద్రతలు పట్టు తప్పాయి.. నిఘా వ్యవస్థ నిద్రావస్థలోకి జారిపోయింది. గడిచిన పదిహేను రోజుల్లో 10 హత్యలు జరగడంతో నగరంలో శాంతి భద్రతలు ప్రశ్నార్థకంగా మారాయి. ఉమ్మడి సౌత్జోన్లో జరుగుతున్న వరుస హత్యలు పోలీసులకు సవాలుగా మారాయి. పదేండ్లలో కనుమరుగైన రౌడీ గ్యాంగ్‌లు, ముఠాలు కేవలం రెండేండ్లలోనే రక్తం చిందిస్తూ మళ్లీ తమ ఉనికిని చాటుకుంటున్నాయి. ఎప్పుడు ఏ గ్యాంగ్ ఎవరిని మట్టుబెడుతుందోననే భయాందోళనలు నగరవ్యాప్తంగా నెలకొన్నాయి.
2023లో మూడు కమిషనరేట్ల పరిధిలో 259 హత్యలు జరిగాయి. కానీ ఈ రెండేండ్లలోనే క్రైమ్ రేటు 20 శాతానికి పెరిగినట్లు క్రైమ్ రికార్డుల ద్వారా తెలుస్తోంది. బీఆర్ఎస్ హయాంలో పోలీసు స్టేషన్లలో అన్ని వర్గాల ప్రజలకు సమ న్యాయం జరిగేలా రిసెప్షన్ మేనేజ్మెంట్, క్రైమ్ ట్రాకింగ్ తదితర అంశాలను సాంకేతికపరంగా ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చి, ప్రపంచ స్థాయిలోనే హైదరాబాద్ పోలీసులకు తీసుకువచ్చిన ప్రత్యేక గుర్తింపు కాంగ్రెస్ పుణ్యమా అని కనుమరుగైపోతోంది.
నేరాలు జరుగుతున్న వాటిని చేధించడంలో పోలీసులు విఫలమవుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ప్రభుత్వ పాలన వైఫల్యంతో ట్రై కమిషనరేట్ల పరిధిలో జరుగుతున్న వరుస హ త్యలు, కాల్పులు, దోపిడీలు, దొంగతనాలు, చైన్‌స్నాచింగ్‌లతో క్రైమ్ రేటు 20 శాతం పెరిగిందంటూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నగర శాంతి భద్రతల అంశంపై ఆవేదన వ్యక్తం చేశారు. ‘ఎట్లున్న నగరం ఎట్లా అయిపాయే.. నా తెలంగాణ ప్రజలకు భద్రత కరువాయే’ అంటూ మనోవేదనకు గురయ్యారు.
పాతబస్తీలో మళ్లీ రౌడీయిజం
మొన్నటి వరకు శాంతియుత వాతావరణంలో ఉన్న పాతబస్తీలో పాలకుల నిర్లక్ష్యం పుణ్యమా అని రౌడీయిజం జడలు విప్పింది. హైదరాబాద్ కమిషనరేట్ పరిధి ఉమ్మడి సౌత్‌జోన్‌తో పాటు ట్రైకమిషనరేట్ పరిధిలో అల్లరిమూకలు, రౌడీగ్యాంగ్‌లు రెచ్చిపోతున్నాయి. సగటున రెండురోజులకో హత్య జరుగుతున్నది. ప్రధానంగా ఉమ్మడి సౌత్జోన్పరిధిలో ఉన్న పాతబస్తీలోని కామాటిపురా, ఫలక్‌నుమా, రెయిన్‌బజార్, పహాడీషరీఫ్, చాంద్రాయణగుట్ట, బండ్లగూడ తదితర పీఎస్‌ల పరిధిలో నేరాలు ఎక్కువగా నమోదవుతున్నాయి. పోలీసుల నిర్లక్ష్యం, నిఘావైఫల్యమే ఇందుకు కారణమనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎవరైనా పాతనేరస్తులు, రౌడీషీటర్లు, ఘరానా నేరస్తుల కదలికలపై పోలీసుల నిఘా లేకుండాపోయిందని నగరవాసులు అంటున్నారు.
ప్రాణాలకు కరువైన భద్రత…
ట్రై కమిషనరేట్ల పరిధిలో ఇటీవల జరుగుతున్న వరుస ఘటనలతో నగరంలో ప్రజల ప్రాణాలకు రక్షణ లేకుండా పోతోందని జనం వాపోతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్‌లోని పాత బస్తీలో ఇటీవల జరిగిన వరుస హత్యలతో జనం బయటకు వెళ్లాలంటేనే జంకుతున్నారు. 5 నెలల కిందట కేపీహెచ్‌బీ కాలనీలో నివాసం ఉంటున్న వృద్ధ దంపతుల ఇంట్లోకి చొరబడి వారిపై కత్తులతో దాడి చేసి, దోపిడీకి పాల్పడిన ఘటన మరవక ముందే అదే ప్రాంతంలో పట్టపగలే ఇంట్లో ఒంటరిగా ఉన్న 10 ఏండ్ల బాలికను దుండగులు కత్తులతో పొడిచి హత్య చేయడంతో ఇళ్లలో ఒంటరిగా ఉండాలంటేనే జనం జంకుతున్నారు.
దోపిడీ దొంగల ముఠాలకు అడ్డాగా నగరం
దోపిడీ దొంగల ముఠాలకు గ్రేటర్ అడ్డాగా మారుతున్నది. ఇలా ఇచ్చి అలా దోచుకోవచ్చనే భావనతో ఆయా రాష్ర్టాలకు చెందిన ముఠాలు సునాయాసంగా తమ పని కానిచ్చేస్తున్నారు. దొంగలు రావడం.. దోచుకుపోవడం.. సీన్ కట్ చేస్తే రంగంలోకి పోలీసు బృందాలు దిగడం….వారం పదిరోజుల తరువాత ముఠాలను ప్రెస్మీట్లో హాజరుపరిచి మార్కులు కొట్టేయడం పోలీసులకు పరిపాటిగా మారింది.
మచ్చుక కొన్ని జరిగిన ఘటనలు..
నేరాలు కట్టడి చేయలేక ఉత్త ప్రకటనలు..
సిటీబ్యూరో: శివారుల్లో రాత్రి పూట జరుగుతున్న హత్యలను నిలువరించలేక.. బయట తిరగొద్దంటూ.. పోలీసులు ఉత్త ప్రకటనలు చేయడంపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. మహేశ్వరం డీసీపీ నారాయణరెడ్డి, ఏసీపీ జానకిరెడ్డి పర్యవేక్షణలో 40 మంది పోలీసులతో డ్రైవ్ నిర్వహించినట్లు బాలాపూర్ ఇన్స్పెక్టర్ సుధాకర్ తెలిపారు. ఎలాంటి ఘటనలు జరగకుండా ఉండేందుకు అత్యవసరమైతే తప్ప.. అర్థరాత్రి ప్రజలు బయటకురావద్దని ఇన్స్పెక్టర్ విజ్ఞప్తి చేశారు. కాగా, పోలీసులు పెట్రోలింగ్ వ్యవస్థను పెంచాల్సిన చోట ప్రజలను బయట తిరగనీయకుండా కట్టడి చేస్తుండటంపై విమర్శలు వస్తున్నాయి.