సిటీబ్యూరో, ఆగస్టు 14: గణేష్ నవరాత్రి ఉత్సవాల నిర్వహణపై హైదరాబాద్ నగర కమిషనర్ సీవీ ఆనంద్ అన్ని శాఖలు, భాగ్యనగర్ ఉత్సవ సమితి, ఖైరతాబాద్ బడా గణేష్ ఉత్సవ సమితి ప్రతినిధులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. గురువారం జరిగిన ఈ కార్యక్రమంలో ఉత్సవ సమితి ప్రతినిధులతో విగ్రహాల ఊరేగింపు, నిమజ్జనం ఏర్పాట్లపై పలు అంశాలను చర్చించారు. ఈ సందర్భంగా నగరంలో విగ్రహాల నిమజ్జనానికి ప్రత్యేకంగా బేబీ పాండ్స్, క్రేన్లతోపాటు, 160 యాక్షన్ టీంలను ఏర్పాటు చేస్తున్నట్లుగా బల్దియా కమిషనర్ కర్ణన్ వివరించారు.
ట్రాఫిక్ అంతరాయం లేకుండా రాత్రి వేళలలో కూడా సిబ్బందిని నియమిస్తామని, మూడు కమిషనరేట్ల పరిధిలోని సీసీటీవీ కెమెరాలను అనుసంధానం చేశామని టీజీఐసీసీసీ డైరెక్టర్ వీబీ కమలాసన్ రెడ్డి తెలిపారు. అదనంగా అంబులెన్స్‌లు, అగ్నిమాపక బృందాలు, మొబైల్ టాయిలెట్లు, విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు, బారికేడ్లను సిద్ధం చేసుకున్నట్లుగా తెలిపారు. వీటితోపాటు పోలీసు శాఖ తరుఫున భద్రత, సీసీటీవీల ద్వారా ఏర్పాట్లు, అదనపు వాలంటీర్ల నియామానికి చర్యలు తీసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులను సీపీ ఆదేశించారు.
గణేష్ నవరాత్రుల సమయంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి, ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించేందుకు కృషి చేయాలన్నారు. దీంతోపాటు వినాయక చవితి నవరాత్రులు, మిలాద్ ఉన్ నబీ పండుగలు ఒకేసారి వస్తున్నందున మతాలకతీతంగా పోలీసుల సమన్వయం చేసుకుంటూ వేడుకలను నిర్వహించుకోవాలన్నారు. డీజేల విషయంలో నిర్వహకులు సహకరించాలని అధికారులు సూచించారు.
అదనపు బస్సులు, మెట్రో రైళ్లను అర్థరాత్రి వరకు నిర్వహిస్తామని, తాగునీటి వసతులు, విద్యుత్ దీపాలు ఉండేలా చర్యలు తీసుకుంటామని ఆయా శాఖల అధికారులు వివరించారు. ఉత్సవాల నిర్వహణకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ, వాటర్ బోర్డు, విద్యుత్, ఆర్టీసీ, సైబరాబాద్, రాచకొండ, హైదరాబాద్ కమిషనరేట్ పోలీసు అధికారులు, హైడ్రా, అగ్నిమాపక, పర్యాటక, సమాచార శాఖ, రవాణా, వైద్య శాఖలతో ఇతర విభాగాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.