సిటీబ్యూరో: అక్రమ అరెస్టులు, లాఠీచార్జీలతో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ క్యాంపస్ పరిసరాలు ఉద్యమ రోజులను తలపిస్తున్నాయి. వీరికి మద్దతుగా నగర వాసులు, పర్యావరణ ప్రేమికులు అరుదైన జీవ వైవిధ్యాన్ని కలిగిన హెచ్‌సీయూ భూములను రక్షించాలంటూ ఆర్తనాదాలతో రోడ్డెక్కుతున్నారు.
ఇక వట ఫౌండేషన్ ఇప్పటికే హెచ్‌సీయూ భూముల కోసం హైకోర్టును ఆశ్రయించగా, పెరుగుతున్న పౌర సమాజం మద్దతుతో ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది. ఈ క్రమంలో నగరంలో హెచ్‌సీయూ పరిరక్షణ కోసం ఆందోళనలు, నిరసనలతో పలు ప్రాంతాల్లో ఉద్రిక్తంగా మారాయి. ఇక సోషల్ మీడియాలోనూ సేవ్హెచ్సీయూ హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ కొనసాగుతున్నది.
మూగజీవాల అరణ్య రోదన
మూగజీవాల అరణ్య రోదనలకు నగరం చలించిపోతున్నది. వన్యప్రాణులకు ఆవాసమైన హెచ్‌సీయూ భూముల కోసం ముక్తకంఠంతో గొంతెత్తుతున్నారు. అరుదైన రాతి సంపద, అంతకు మించిన వృక్ష సంపదను కాపాడుకునేందుకు గడిచిన ఐదు రోజులుగా నగరవాసుల భాగస్వామ్యం పెరుగుతూనే ఉంది. విద్యార్థులకు మద్దతుగా ఓవైపు సెలబ్రిటీలు, మరోవైపు రాజకీయ పార్టీల నాయకులు కాంగ్రెస్ పార్టీ కుట్రపూరిత నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు.
వీరికి మద్దతుగా నగరంలోనూ పలు చోట్ల నిరసన తెలుపుతూ సేవ్ హెచ్సీయూకు మద్ధతు తెలుపుతున్నారు. బుధవారం నగరంలోని ఆర్టీసీ క్రాస్ రోడ్డు వద్ద విద్యార్థులు, పర్యావరణ ప్రేమికులు నిరసన తెలిపారు. కేబీఆర్ పార్క్ వద్ద బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆందోళనలో ప్రకృతిని కాపాడంటూ విద్యార్థులతో కలిసి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు గొంతెత్తారు. హెచ్‌సీయూ అధ్యాపక సంఘం ఆధ్వర్యంలోనూ ప్రొఫెసర్లు గళమెత్తారు.
Police
పెరుగుతున్న మద్దతు..
విద్యార్థులకు మద్దతు తెలుపుతూ సినీ ప్రముఖులు, విద్యావేత్తలు, సామాజిక కార్యకర్తలు, స్వచ్ఛంద, పర్యావరణ పరిరక్షణ సంఘాలు కూడా ఉద్యమిస్తున్నాయి.ఈ క్రమంలో సేవ్ హెచ్‌సీయూ హ్యాష్‌ట్యాగ్ ట్రెండవుతున్నది. పీడీఎస్‌యూ, ఎస్ఎఫ్ఐ, ఇతర వామపక్ష విద్యార్థి సంఘాలు భూముల అన్యాక్రాంతంపై అడ్డుకునేలా గురువారం చలో సెక్రటేరియట్‌కు పిలుపునిచ్చాయి.
వర్సిటీని సందర్శించిన అధికారుల బృందం
మియాపూర్: బల్దియా అధికారుల బృందం యూనివర్సిటీని బుధవారం సందర్శించింది. అడ్మినిస్ట్రేటివ్ భవనం వరకు వెళ్లి అధికారాలతో మాట్లాడేందుకు ప్రయత్నించింది. అక్కడ వందలాది విద్యార్థులు ఆందోళన చేపడుతుండడంతో వెను తిరిగింది.
విద్యార్థులపై లాఠీచార్జీ చేయడం అమానుషం ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు
కేపీహెచ్‌బీ కాలనీ: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను విక్రయించకుండా పోరాడుతున్న విద్యార్థులకు అండగా నిలవాలని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కోరారు. బుధవారం కూకట్పల్లి క్యాంప్ ఆఫీసులో మీడియాతో ఆయన మాట్లాడుతూ… అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ హెచ్‌సీయూకి కేటాయించిన భూములను నేడు ఇందిరమ్మ వారసులు అమ్ముకోవడానికి చూస్తున్నారని విమర్శించారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన భూములను కాపాడేందుకు బీఆర్ఎస్ పోరాడుతున్నదని.. విద్యార్థుల పోరాటానికి అండగా ఉంటుందని తెలిపారు. భూములను కాపాడేందుకు పోరాడుతున్న విద్యార్థులపై లాఠీచార్జీ చేయడం అమానుషమన్నారు.