మణికొండ, అక్టోబర్ 21: నిర్లక్ష్యంగా దూసుకొచ్చిన ఓ కారు రెండేండ్ల చిన్నారి ప్రాణాలను కబళించింది. సోమవారం నార్సింగి పోలీస్స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి… ఎన్టీఆర్ జిల్లాకు చెందిన రవికుమార్ హైదరాబాద్లోని నార్సింగ్ ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. సోమవారం సాయంత్రం పిల్లలకు పటాకులు కొనించేందుకు భార్య అనూష, ఐదేండ్ల వయసున్న కుమార్తె ఆవిష్క, రెండేండ్ల వయస్సున కొడుకు కుషాణ్ జోయల్తో కలిసి తన ద్విచక్ర వాహనంపై బయటకు వెళ్లారు. షాపింగ్ ముగించుకొని తిరిగి ఇంటికి బయలుదేరారు.
అల్కాపురి టౌన్షిప్ రాగానే వెనుక నుంచి వేగాంగా దూసుకొచ్చిన కారు ఢీకొట్టింది. దీంతో వాహనంపై ఉన్న కుటుంబం అంతా కిందపడిపోయారు. కిందపడిపోయిన రెండేండ్ల కుషాణ్ జోయల్పై నుంచి కారు దూసుకుపోయింది. తీవ్ర గాయాలపాలైన జోయల్ను చికిత్స నిమిత్తం దవాఖానకు తరలిస్తుండగా దారిలోనే చిన్నారి మృతి చెందాడు. మృతి చెందిన బాలుడి తల్లి దండ్రులకు, అతని సోదరికి గాయాలయ్యాయి. అల్లారు ముద్దుగా అప్పటి వరకు మాట్లాడుతూ సందడి చేసిన రెండేండ్ల కొడుకు ఇక లేడనే విషయాన్ని ఆ తల్లిదండ్రలు నమ్మలేకపోతున్నారు.