చిక్కడపల్లి, డిసెంబర్ 29 : ఇందిరాపార్క్ సమీపంలో కళాభారతి ఎన్టీఆర్ స్టేడియంలో కొనసాగుతున్న బుక్‌ఫెయిర్ ఆదివారంతో ముగిసింది. 10 రోజులుగా కొనసాగుతున్న పుస్తక ప్రదర్శనలో చివరిరోజు పాఠకులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. ముగింపు సభకు జస్టిస్ రాధారాణి, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ రామచంద్రమూర్తి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జస్టిస్ రాధారాణి మాట్లాడుతూ పుస్తకం మనల్ని కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తుందన్నారు. ప్రపంచంలో అనేక మార్పులు పుస్తకాలు తెస్తాయన్నారు. మనం చదవడంతో పాటు పిల్లల్ని చదివించాలని సూచించారు. ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ కంప్యూటర్ వచ్చిన పుస్తకాల విలువ తగ్గలేదన్నారు.
సాఫ్ట్వేర్ ఉద్యోగులు సైతం పుస్తకాలు చదువుతూ ఉండటం సంతోషకరం అని అన్నారు. బుక్‌ఫెయిర్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కవి యాకూబ్, ఆర్.వాసులు మాట్లాడుతూ బుక్ ఫెయిర్‌కు 37 యేండ్ల చరిత్ర ఉందని అన్నారు. బుక్ ఫెయిర్‌కు జనాల ఆదరణ పెరిగిందన్నారు. సమాజానికి కావలిసిన జ్ఞానాన్ని అందించే పండుగ పుస్తక పండుగ అని అన్నారు. ఈ రోజుతో బుక్ ఫెయిర్ విజయవంతంగా ముగిసిందన్నారు. ఈ సమావేశంలో బుక్ ఫెయిర్ ఉపాధ్యక్షుడు బాల్‌రెడ్డి, కోశాధికారి నవ చేతన నారాయణ రెడ్డి, శోభన్ బాబు, సురేశ్, సూరిబాబు, సాంబశివరావు, శ్రీకాంత్, శ్రీనివాస్, స్వరాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
దక్కన్ హెరిటేజ్ అకాడమీ ట్రస్ట్ ఆధ్వర్యంలో మూడు సాహిత్య చారిత్రక పుస్తకాలను ఆవిష్కరించారు. ప్రముఖ రచయిత డాక్టర్ మంగరి రాజేందర్ (జింబో) రచించిన ‘కోర్టు తీర్పుల్లో సాహిత్య మెరుపులు’ రచయిత ఎమని శివనాగిరెడ్డి రచించిన ‘తెలంగాణ శిథిలాలు వ్యథభరిత కథనాలు’ రామోజు హరగోపాల్ రచించిన ‘తెలంగాణ చరిత్ర తొవ్వల్లో’ లాంటి పుస్తకాలను ఆవిష్కరించారు.
ఈకార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్, టీఎస్పీఎస్సీ మాజీ చైర్మన్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ రామచంద్రమూర్తి, మాజీ న్యాయమూర్తి ప్రముఖ రచయిత డాక్టర్ మంగరి రాజేందర్ హాజరై పుస్తకాలను ఆవిష్కరించారు. ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి మాట్లాడుతూ మరుగున పడిన అనేక విషయాలను శివనాగి రెడ్డి వెలుగులోకి తెస్తారన్నారు. ప్రొఫెసర్ ఎస్.రఘు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో చరిత్ర పరిశోధకుడు బి.వి భద్రగిరీశ్(తెలంగాన చరిత్ర కారుడు), డాక్టర్ శ్యాంసుందర్ రావు, దక్కన్ హెరిటేజ్ అకాడమీ చైర్మన్ వేదకుమార్, శివనాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.