కవాడిగూడ, డిసెంబర్ 25: సెలవు దినం కవాడంతో గురువారం సాయంత్రం తెలంగాణ కళాభారతి (ఎన్టీఆర్ స్టేడియం)లో ప్రజాకవి అందెశ్రీ ప్రాంగణంలోని 38వ బుక్‌ఫెయిర్ పుస్తకాభిమానులు, సాహితీ ప్రియలు, సందర్శకులతో నిండిపోయింది. ఒకవైపు అనిశెట్టి రజిత ప్రధాన వేదికపై బాలోత్సవంలో భాగంగా వివిధ పాఠశాలల విద్యార్థులు, పలు సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇదే వేదికపై పుస్తక స్ఫూర్తి పేరుతో నిర్వహిస్తున్న చర్చా వేదికలు అందరినీ ఆలోచింపచేసాయి. మరోవైపు కొంపెల్లి వెంకట్‌గౌడ్ వేదికపై కొత్త పుస్తకాలు పురుడుపోసుకున్నాయి.
ఎటు చూసినా ప్రాంగణమంతా పుస్తకాభిమానులతో సందడిగా కనిపించింది. అనిశెట్టి రజిత వేదికపై బాలోత్సవం ఆధ్వర్యంలో నిర్వహించిన నెమలి భళా నృత్యం ఆహూతులను విశేషంగా ఆకట్టుకుంది. బుక్‌ఫెయిర్‌ను సందర్శించిన హైకోర్టు జడ్డి కాజ శరత్ నృత్యాలు చేసిన త్రైలోక్యం ఆర్ట్స్, ప్రగతీ విద్యానికేతన్ విద్యార్థులకు సర్టిఫికెట్లను అందజేశారు. ఈ సందర్భంగా బుక్‌ఫెయిర్ అధ్యక్షులు కవి యాకూబ్, ప్రధాన కార్యదర్శి వాసుల, బాల్‌రెడ్డి ఆధ్వర్యంలో జడ్జి కాజ శరత్‌ను ఘనంగా సత్కరించారు.
తెలంగాణ ఉద్యమ జర్నలిస్టుల సంఘం ఆధ్వర్యంలో బుక్‌ఫెయిర్‌లోని కొంపెల్లి వెంకట్‌గౌడ్ వేదికపై కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార గ్రహీత డాక్టర్ పసునూరి రవీందర్ రచించిన పసునూరి పంచ్ పుస్తకాన్ని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వీసీ గంటా చక్రపాణి ముఖ్య అతిథిగా హాజరై ప్రముఖ పాత్రికేయులు పాశం యాదగిరితో కలసి ఆవిష్కరించారు. డాక్టర్ సంగిశెట్టి శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ సూరేపల్లి సుజాత, రహమాన్, ఆచార్య శ్రవణ్ తదితర సాహిత్యప్రియులు పాల్గొన్నారు.
ఛాయ సంస్థ ఆధ్వర్యంలో ఆరతీకుమార్ రచించిన ‘చెరిగిపోతున్న చివరి సరిహద్దులు’, మదురాంతకం నరేంద్ర రచించిన ‘నీరు పల్లమెరుగు’ పుస్తకాలను బుక్‌ఫెయిర్ అధ్యక్షులు కవి యాకూబ్ ఆవిష్కరించారు. అదే విధంగా ‘అనగనగా ఒక నేను’, ‘అహానికి ఆవల’, ‘కరణం బాలసుబ్రహ్మణ్యం పిైళ్లె’ పుస్తకాలు ఇదే వేదిక మీద ఆవిష్కరించబడ్డాయి. ‘కగార్ రిపబ్లిక్’ పుస్తకాన్ని గాయని సంధ్య ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అరసవిల్లి కృష్ణ, గోవర్ధన్, భరద్వాజ తదితరులు పాల్గొన్నారు. ఇదే వేదికపై చెకుముకి రాళ్ళు, నిజ జీవిత కథలు, రుషి పుస్తకాలు ఆవిష్కరించారు. పుస్తక ప్రియులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
బుక్‌ఫెయిర్‌లోని అనిశెట్టి రజిత వేదికపై ఒద్దిరాజు ప్రవీణ్‌కుమార్, పేర్ల రాములు సమన్వయంలో జరిగిన పుస్తకస్ఫూర్తి, పుస్తకం ఒక దారిదీపం చర్చా కార్యక్రమంలో విమల మోర్తాల, చూపు కాత్యాయని, మెర్సీమార్గరెట్లు పాల్గొన్నారు. సమాజంలో మంచి మార్పు తీసుకురావడానికి సాహిత్యమే ప్రధాన భూమిక పోషిస్తుందని విమల మార్తాల అన్నారు.