జూబ్లీహిల్స్, జూన్ 10: బస్తీ దవాఖానాలలో మళ్లీ జీతాల సంక్షోభం మొదలైంది. రాష్ట్ర వ్యాప్తంగా బస్తీ దవాఖానాలలో గత 2 నెలలుగా జీతాలు రావడం లేదు. ప్రతి బస్తీ దవాఖానాలో ఒక మెడికల్ ఆఫీసర్, ఒక స్టాఫ్ నర్స్, ఒక సపోర్టింగ్ స్టాఫ్ ఉంటారు. అయితే గత 2 నెలలుగా వీరికి వేతనాలు రాకపోవడంతో తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారు. నెలంతా కష్టపడి కొలువులు చేస్తూ 10 వ తారీఖు వరకు జీతాలు పడకపోతేనే ఇబ్బందులు పడే ఉద్యోగులకు 2 నెలల 10 రోజులు గడిచినా జీతం ఊసే లేకపోవడంతో ఉసూరుమంటూ ఉద్యోగాలు చేస్తున్నారు. పేద ప్రజలకు ఆరోగ్య భరోసా ఇస్తూ.. నిత్యం రోగులకు సేవలందిస్తూ.. ఆరోగ్య తెలంగాణ కోసం అహర్నిశలు శ్రమిస్తున్న బస్తీ దవాఖానలపై ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ చూపిస్తుందన్న విమర్శలు వస్తున్నాయి. వైద్య రంగంలో కీలకంగా వున్న బస్తీ దవాఖానాలను పట్టించుకోక పోవడంతో గతంలో కూడా సంబంధిత వైద్యులు రోడ్డెక్కిన సందర్భాలున్నాయి.
నలిగిపోతున్న వేలాది మంది వైద్యులు.. సిబ్బంది..
బస్తీ దవాఖానాలలో గత 2 నెలలుగా వేతనాలు అందక వేలాది మంది ఉద్యోగులు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్ జిల్లాలో 169 బస్తీ దవాఖానాలలో 1 మెడికల్ ఆఫీసర్, 1 స్టాఫ్ నర్స్, 1 సపోర్టింగ్ స్టాఫ్ తో కలుపుకుని 500 మందికి పైగా ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ లో సుమారు 300.. రాష్ట్ర వ్యాప్తంగా 450 బస్తీ దవాఖానాలున్నాయి. ఆయా దవాఖానాలలో 1300 మందికి పైగా వైద్యాధికారులు, వైద్య సిబ్బంది వేతనాల వెతలతో అల్లాడిపోతున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం వీరిని పట్టించుకోక పోవడంతో ఎవరికి చెప్పుకోవాలో తెలియక తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు.
ఉద్యోగులకు సమస్యలు వస్తే ఉద్యోగ సంఘాలు.. జూనియర్ డాక్టర్లకు అన్యాయం జరిగితే జూడాల ఆర్గనైజేషన్ లు కదిలి వస్తాయి.. కానీ బస్తీ దవాఖానాలకు ఒక యూనియన్ కానీ ఇతర సంఘాలు కానీ లేకపోవడంతో వేతనాల సమస్యలను ఎవరికీ చెప్పుకోలేని స్థితిలో వున్నారు. అమ్మ అయినా అడగనిదే అన్నం పెట్టదంటారు. ఇక బస్తీ దవాఖానాల తరపున అడిగే వారు లేకపోవడంతో ఈ విషయం అధికారులకు చెప్పుకునే వారు కరువయ్యారు. గతంలో బస్తీ దవాఖానాలలో జీతాలు రాక తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ కార్యాలయానికి చేరుకుని అక్కడ సమీక్ష సమావేశానికి హాజరైన వైద్య ఆరోగ్య శాఖ మంత్రికి తమ గోడును వెళ్లబోసుకున్న వైద్యులతో మీకు ఇన్ని నెలల నుంచి జీతాలు రావడం లేదని నాకు తెలియదని ఆమాత్యులు తాపీగా సెలవిచ్చారు. ఇన్ని నెలలుగా జీతాలు ఇవ్వకుండా ఉద్యోగులు ఏమి తింటున్నారు.. ఎలా పనులు చేస్తున్నారు అని అడిగే వారు లేకపోవడంతో బస్తీ దవాఖానాలలో నాణ్యమైన వైద్య సేవలు సైతం కరువయ్యాయి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి బస్తీ దవాఖానాలకు వేతనాలు విడుదల చేసి ఆదుకోవాలని సంబంధిత వైద్య అధికారులు, సిబ్బంది కోరుతున్నారు.