Hyderabad | బండ్లగూడ, జూన్ 3: హైదరాబాద్‌లోని బండ్లగూడ జాగిర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అరుణోదయ నగర్ కాలనీకి చెందిన దాసరి సురేశ్ బాబు, అతని కుమార్తె రియా రోస్లిన్ సంగీతంలో గిన్నిస్ రికార్డు సృష్టించారు. ఆన్లైన్ కీబోర్డు మెలోడీ పోటీల్లో విజయం సాధించారు. ఈ పోటీలో 18 దేశాల నుంచి 1046 మంది కంటెస్టెంట్లు పాల్గొనగా.. దాసరి సురేశ్ బాబు, రియా విజయం సాధించారు. ఈ నేపథ్యంలో గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ అధికారి రిచర్డ్ స్టెన్నింగ్స్ వీరి ప్రతిభను గుర్తించారు.
కాగా, సురేశ్‌బాబు ప్రస్తుతం ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో సీనియర్ మేనేజర్‌గా పనిచేస్తుండగా.. రియా డాన్‌బాస్కో పాఠశాలలో నాలుగో తరగతి చదువుతోంది. సంగీతంపై ఆసక్తితో ఇద్దరూ హాలెల్ మ్యూజిక్ స్కూల్లో శిక్షణ తీసుకున్నారు. ఈ క్రమంలోనే కీబోర్డు మెలోడీ పోటీల్లో పాల్గొని విజయం సాధించి గిన్నిస్ రికార్డు సృష్టించారు. ఈ నేపథ్యంలో ఈ తండ్రీకూతుళ్లను బండగూడ జాగిర్ మున్సిపల్ కార్పొరేషన్ ఆల్ కాలనీస్ ఫెడరేషన్ వారి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కలిసి అభినందించారు. వారిని శాలువాతో సత్కరించారు.