Auto Driver | మలక్ పేట ఏప్రిల్ 9: హైదరాబాద్‌లో ఓ ఆటో డ్రైవర్ తన నిజాయితీని చాటుకున్నాడు. ఆటోలో ఓ ఐటీ ఉద్యోగి మరిచిపోయిన రెండు లాప్టాప్లను పోలీసులకు అందజేశాడు. అతని నిజాయితీని మెచ్చుకున్న చాదర్‌ఘాట్ పోలీసులు ఆటో డ్రైవర్‌కు వెయ్యి రూపాయల నగదు బహుమతి ఇచచి సన్మానించారు.
పోలీసుల కథనం ప్రకారం.. చైతన్యపురి సాయి రాఘవేంద్ర రెసిడెన్సీకి చెందిన శ్రీనివాసరావు ఐటీ ఉద్యోగి. ఈ నెల 3వ తేదీన సీతారాంబాగ్‌లో విధులు ముగించుకుని ఇంటికి బయల్దేరాడు. ఈ క్రమంలో ఉప్పల్ చిలుకానగర్‌కు చెందిన పడిగె రాంచందర్ ఆటో ఎక్కాడు. తాను దిగాల్సిన చోటు రావడంతో శ్రీనివాసరావు హడావుడిగా వెళ్లిపోయాడు. ఆ సమయంలో ఆఫీసుకు చెందిన రెండు ల్యాప్‌టాప్‌లను ఆటోలోనే మరిచిపోయాడు. కొద్దిసేపటికి లాప్‌టాప్‌లు మరిచిపోయిన సంగతి గుర్తుకురావడంతో వెంటనే చాదర్‌ఘాట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.
ఇదిలా ఉంటే శ్రీనివాసరావు దిగిన చాలాసేపటికి ఆటోలో ల్యాప్‌టాప్‌లను గమనించిన రాంచందర్.. వాటిని మహంకాళి పోలీస్ స్టేషన్లో అప్పగించారు. కాగా, మహంకాళి పోలీస్ స్టేషన్, చాదర్‌ఘాట్ పోలీస్ స్టేషన్ సిబ్బంది సమన్వయంతో రెండు ల్యాప్‌టాప్‌లను బుధవారం నాడు శ్రీనివాసరావుకు అందజేశారు. అలాగే ఆటో డ్రైవర్ నిజాయితీని మెచ్చుకున్న పోలీసులు.. అతనికి రూ.1000 నగదు పురస్కారాన్ని ఇచ్చి ఘనంగా సన్మానించారు.