Hyderabad | గోల్నాక, ఫిబ్రవరి 1: విదేశీ యువతులతో వ్యభిచారం చేయిస్తున్న ఓ ముఠా గుట్టు రట్టయ్యింది. హైదరాబాద్ గోల్నాకలో విదేశీ యువతులతో వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ నిర్వాహకుడితోపాటు విటుడిని అంబర్‌పేట పోలీసులు అరెస్టు చేశారు.
ఇన్స్పెక్టర్ డి.అశోక్ తెలిపిన వివరాల ప్రకారం.. గోల్నాక జిందా తిలస్మాత్ వద్ద ఓ ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పక్కా సమాచారం అందింది. దీంతో శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో నిర్వాహకుడు తిమోతీ బార్చి (30)తో పాటు విటుడు లింగాల బాల్‌రెడ్డిని అరెస్టు చేశారు. అలాగే వ్యభిచారం చేస్తున్న ఉగాండాకు చెందిన నలుగురు యువతులతో పాటు కెన్యాకు చెందిన మరో యువతిని రెస్క్యూ హోమ్‌కు తరలించారు. దీనిపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
కాగా నిర్వాహకుడు తిమోతీ బార్చి (30)ని లైబీరియా దేశానికి చెందిన వ్యక్తిగా పోలీసులు నిర్ధారించారు. లైబీరియా నుంచి హైదరాబాద్‌కు వచ్చి ఇక్కడ డిగ్రీ చదువుతున్నాడు. ఇదే సమయంలో వ్యభిచార గృహం నిర్వహిస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు.