సిటీబ్యూరో, జనవరి 14 (నమస్తే తెలంగాణ): ఎయిర్ పోర్ట్ మెట్రో పనులను వేగవంతం చేసేందుకు సమాంతరంగా అనేక ముందస్తు నిర్మాణ కార్యక్రమాలు ప్రారంభించామని, ఆ పనులు శరవేగంగా సాగుతున్నాయని హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ మెట్రో లిమిటెడ్ (హెచ్ఎఎంఎల్) ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. జనరల్ కన్సల్టెంట్ కోసం బిడ్ల సమర్పణకు ఈ నెల 20 చివరి తేదీ కాగా, నిపుణులైన ఇంజినీరింగ్ కన్సల్టెంట్లు వచ్చే నెల మొదటి వారంలో నియమితులవుతారని, ఈలోగా మెట్రో అలైన్‌మెంట్‌ను పకాగా సరిదిద్దడానికి, స్టేషన్ల స్థానాలను నిర్ణయించేందుకు చేపట్టిన సర్వే పనులు ముమ్మరంగా సాగుతున్నాయన్నారు.
శాటిలైట్ ఆధారిత డిఫరెన్షియల్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ (డీజీపీఎస్), ఎలక్ట్రానిక్ టోటల్ స్టేషన్ అనే రెండు పద్ధతులు ఉపయోగించి, కచ్చితమైన కో ఆర్డినేట్లను తెలుసుకునేందుకు సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్‌ల సాయంతో సర్వే పని జోరుగా జరుగుతున్నదన్నారు. శంషాబాద్ పట్టణానికి సమీపంలోని ఫోర్ట్ గ్రాండ్ అండర్ పాస్ వరకు ఇప్పటివరకు 21 కిలోమీటర్ల మేర సర్వే పూర్తయింది.
ఈ నెలాఖరులోగా మొత్తం సర్వే పూర్తి కానుందని, ఆ తర్వాత అలైన్‌మెంట్‌ను తెలియజేసేలా పెగ్ మారింగ్ ప్రారంభిస్తామని ఎన్వీఎస్ రెడ్డి పేర్కొన్నారు. స్టేషన్ స్థానాలను గుర్తించేందుకు ఢిల్లీ మెట్రో బృందం ఇంతకు ముందు రూపొందించిన డీపీఆర్‌లో మామూలు రైల్వే ఇంజినీరింగ్ పద్ధతిని అనుసరించగా, నానక్‌రామ్ గూడ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, కోకాపేటలలో కొన్ని సంవత్సరాలుగా జరిగిన భారీ వాణిజ్య,నివాస ప్రాంతాల అభివృద్ధిని గుర్తించడం ద్వారా ఇప్పుడు ఒక వినూత్న విధానాన్ని అవలంబిస్తున్నామన్నారు.