సిటీబ్యూరో, జూన్ 9 (నమస్తే తెలంగాణ): పేరులో పొరపాటు ఉందని..నష్టపరిహారం తిరస్కరించవద్దని, ఇతర ధ్రువీకరణపత్రాలను పరిగణలోకి తీసుకొని.. నామినీకి బీమా డబ్బులు చెల్లించాలని హైదరాబాద్ వినియోగదారుల కమిషన్-3 అధ్యక్షుడు ఎం. రాంగోపాల్‌రెడ్డి, సభ్యులు డి. శ్రీదేవి, జె.శ్యామలతో కూడిన బెంచ్ నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీకి ఆదేశించింది.
నిర్మల్ జిల్లాకు చెందిన ఎండీ సలామ్ ఖాన్ అలియస్ షా అలమ్ ఖాన్ ఆటో డ్రైవర్. అతడికి ట్రాన్స్పోర్ట్ డ్రైవర్, హోమ్ గార్డ్స్, జర్నలిస్ట్స్ సామాజిక భద్రతా పథకంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం కార్మిక శాఖ ఆధ్వర్యంలో వ్యక్తిగత ప్రమాద బీమాను కల్పించింది. 2015, ఆగస్టు 24న సలామ్ ఖాన్ రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. మృతుడి భార్య నఫీస్ బేగం తన భర్త బీమా డబ్బులు చెల్లించాలని కార్మిక శాఖను అభ్యర్థించింది. అయితే మృతుడి ధ్రువీకరణ పత్రాల్లో పేరు వ్యత్యాసం ఉండటంతో ఇన్సూరెన్స్ కంపెనీ బీమా చెల్లించేందుకు నిరాకరించింది.
ఈ క్రమంలో మృతుడి భార్య హైదరాబాద్ వినియోగదారుల కమిషన్-3ను ఆశ్రయించగా, అన్ని పత్రాలను పరిశీలించిన కమిషన్.. నిరక్షరాస్యత వల్ల పాలసీదారుడు పేరును వ్యత్యాసంతో రాసి ఉంటాడని భావించింది. పాలసీ ప్రకారం ఉన్న పేరును కాకుండా ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్, పీఎంఈ రిపోర్టును పరిగణలోకి తీసుకొని రూ.5 లక్షల బీమా డబ్బులను రూ.9 శాతం వడ్డీతో చెల్లించాలని నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీకి కమిషన్ ఆదేశించింది. ఖర్చుల కింద మరో రూ.10వేలు చెల్లించాలని స్పష్టం చేసింది.
ఆరోగ్య బీమా పాలసీదారుడికి రూ. 1.20 లక్షల వైద్య ఖర్చులను చెల్లించాలని.. మ్యాక్స్ బుప్పా హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీకి.. హైదరాబాద్ వినియోగదారుల కమిషన్-3 అధ్యక్షుడు ఎం. రాంగోపాల్‌రెడ్డి, సభ్యులు డి. శ్రీదేవి, జె. శ్యామలతో కూడిన బెంచ్ ఆదేశించింది. సుల్తాన్‌బజార్‌కు చెందిన సురేశ్ 2016లో ‘ఫ్యామిలీ ఫస్ట్ సిల్వర్ ప్లాన్’ అనే ఆరోగ్య బీమా పాలసీని తనతో పాటు భార్య, కుమారుడితో కలిపి పొందారు. 2019లో రెండు కండ్లకు శస్త్ర చికిత్స చేయించుకున్నాడు.
వైద్య ఖర్చుల క్లెయిమ్ కోసం పత్రాలను మ్యాక్స్ బుప్పా లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థకు సమర్పించాడు. ఇందుకు సంస్థ వైద్య ఖర్చులను చెల్లించేందుకు అంగీకరించలేదు. దీంతో పాలసీదారుడు హైదరాబాద్ వినియోగదారుల కమిషన్-3ను న్యాయం కోసం ఆశ్రయించగా, గత 12 ఏండ్లుగా డయాబెటిస్తో పాలసీదారుడు బాధపడుతున్నాడని, ఇన్సూరెన్స్ సంస్థ కమిషన్ ముందు వాదించింది. అయితే తనకు ఎలాంటి డయాబెటిస్ లేదని, పాలసీ తీసుకునే ముందు, సర్జరీకి ముందు కూడా పరీక్షలు చేసుకున్నానని సురేశ్ తన రిపోర్టులు కమిషన్ ముందుంచారు.
పరిశీలించిన కమిషన్.. ఇన్సూరెన్స్ సంస్థ వాదనల్లో ఆధారం లేదని, ఇది సేవాలోపం కిందకు వస్తుందని మొట్టికాయలు వేసింది. అన్ని అంశాలను పరిశీలించిన కమిషన్.. వైద్య ఖర్చుల కింద రూ.లక్షా 20వేలు 9 శాతం వడ్డీతో చెల్లించాలని, రూ.20వేలు నష్టపరిహారంతో పాటు రూ.5వేలు ఖర్చుల కోసం చెల్లించాలని మ్యాక్స్ బుప్పా హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీని ఆదేశించింది.