సిటీబ్యూరో, జూన్ 09 (నమస్తే తెలంగాణ ): నగర శివారులోని తురయాంజల్ మున్సిపాలిటీ పరిధిలోని తొర్రూరు హెచ్ఎండీఏ లే అవుట్లో 148 ప్లాట్ల ఈ వేలానికి (ఆన్లైన్)కు హెచ్ఎండీఏ చర్యలు ముమ్మరం చేసింది. ఆన్లైన్ వేలంలో భాగంగా గురువారం అధికారులు ప్రీ బిడ్ సమావేశం నిర్వహించారు. దాదాపు వంద మంది ఆసక్తి కలిగిన కొనుగోలుదారులు ఈ ప్రీ బిడ్ సమావేశానికి హాజరయ్యారు. ఇప్పటికే ఒక దఫా మంచి డిమాండ్‌తో తొర్రూరు లే అవుట్ ప్లాట్లు కోనుగోలు చేసిన ఔత్సాహికులు రెండో దశలో ప్లాట్లు కోనుగోలుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
కాగా రెండో దశలో తొర్రూరు వెంచర్లో148 ప్లాట్లను హెచ్ఎండీఏ ఆన్లైన్ వేలం ద్వారా విక్రయించనుంది. వెంచర్ ప్రాధాన్యత, మౌలిక సదుపాయాల గురించి హెచ్ఎండీఏ చీఫ్ ఇంజినీర్ (సీఈ) బీఎల్ఎన్ రెడ్డి, ఎస్టేట్ ఆఫీసర్ గంగాధర్ వివరించారు. వెంచర్లో నిర్మాణ పనుల అనుమతులపై చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ (సీపీవో ) గంగాధర్ తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎంఎస్టీసీ ప్రతినిధి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఔత్సాహికుల సందేహాలను హెచ్ఎండీఎ ఉన్నతాధికారులు నివృత్తి చేశారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ ఇంజినీర్ (ఎస్ఈ) పరంజోతి, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ అప్పారావు తదితులు పాల్గొన్నారు.
భూ సమీకరణ పథకం కింద లేఅవుట్లను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వాలు ప్రయత్నాలు ప్రారంభించాయి. తాజాగా 11 ఏండ్ల తర్వాత రైతులు ముందుకు వచ్చి తమ భూములను అప్పగించేందుకు అంగీకరించారు. కొంత కాలంగా హెచ్ఎండీఏ కమిషనర్ అర్వింద్ కుమార్ ప్రత్యేక చొరవ తీసుకొని ప్రభుత్వం ఏర్పాటు చేసే లేఅవుట్ల ద్వారా ఉండే ప్రయోజనాలను భూ యజమానులకు వివరించేలా చర్యలు చేపట్టారు.
దీనికి తోడు ఉప్పల్ భగాయత్‌లో హెచ్ఎండీఏ చేపట్టిన లేఅవుట్లో అభివృద్ధి చూసి రైతులు తమ భూములను అప్పగించేందుకు ముందుకు వస్తున్నారు. ముఖ్యంగా నగర శివారు ప్రాంతాల్లో మరిన్ని ప్రాంతాల్లో భూ సమీకరణ పథకం కింద హెచ్ఎండీఏ లేఅవుట్లను అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించింది.