సిటీబ్యూరో, జూన్ 9 (నమస్తే తెలంగాణ) : నగర శివారు ప్రాంతాల్లో ప్రణాళికాబద్ధమైన పట్టణీకరణకు హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) పటిష్టమైన కార్యాచరణతో ముందుకు వెళుతోంది. ప్రైవేటు సంస్థలు చిన్న చిన్న లేఅవుట్లు చేయడం ద్వారా భవిష్యత్‌లో ఎదురయ్యే ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వ రంగ సంస్థగా హెచ్ఎండీఏనే స్వయంగా భారీ లేఅవుట్లను సకల సౌకర్యాలతో అభివృద్ధి చేస్తోంది. ఇందుకోసం ల్యాండ్ పూలింగ్ స్కీమ్ కింద రైతుల నుంచి భూములను సమీకరిస్తోంది.
తాజాగా మేడ్చల్ -మల్కాజ్గిరి జిల్లా ఘట్కేసర్ మండల పరిధిలోని ప్రతాప సింగారంలో ఒకే చోట 130 ఎకరాల్లో భూములను సమీకరించింది. దీనికి సంబంధించి రైతులు సమ్మితి లేఖలను హెచ్ఎండీఏ భూసమీకరణ విభాగం అధికారులకు అందించారు. దీంతో రైతులకు చెందిన 130 ఎకరాల భూముల్లో సర్వే చేపట్టేందుకు గత నెల 28న హెచ్ఎండీఏ నోటిఫికేషన్‌ను జారీ చేసింది.
ఇందులో సర్వే నంబర్లు 12 నుంచి 45 వరకు, 65 నుంచి 94, 96 నుంచి 119 వరకు, 150 నుంచి 160, 163 నుంచి 165, 176 నుంచి 178 , 201 నుంచి 217 వరకు, 293 నుంచి 294, 296,303 నుంచి 309/పీలు ఉన్నాయి. ఈ సర్వే నంబర్లలో మొత్తం 130 ఎకరాల విస్తీర్ణంలో భూములు ఉన్నాయని, ఈ భూములను రైతులతో డెవలప్మెంట్ అగ్రిమెంట్ చేసుకొని క్షేత్ర స్థాయిలో పనులు నిర్వహిస్తామని, 3 నుంచి 6 నెలల వ్యవధిలో ఈ లేఅవుట్ అభివృద్ధి చేస్తామని అధికారులు తెలిపారు
భూసమీకరణ పథకం-2017లో భాగంగా రైతుల నుంచి సమీకరించి అభివృద్ధి చేసిన లేఅవుట్లలో 60 శాతం వాటా రైతులకు, 40 శాతం వాటా హెచ్ఎండీఏకు ఉంటుంది. గతంలో ల్యాండ్ పూలింగ్ స్కీమ్ ప్రక్రియ కింద 50:50 శాతం ఉండగా, దాన్ని రాష్ట్ర ప్రభుత్వం 60:40 శాతంగా ఖరారు చేస్తూ జీవో నెంబర్ 83ని జారీ చేసింది. దాంతో హెచ్ఎండీఏ పరిధిలోని పలు గ్రామాల రైతులు భూములు ఇచ్చేందుకు ముందుకొస్తున్నారు.
లేఅవుట్ అభివృద్ధిలో భాగంగా మాస్టర్ ప్లాన్‌కు అనుగుణంగా రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్, తాగునీరు, పార్కులకు స్థలాలు వంటివి ఏర్పాటు చేస్తారు. ల్యాండ్ పూలింగ్ స్కీం కింద భూమలు ఇచ్చే వారికి ఆర్థికపరమైన సమస్యలు లేకుండా అన్ని రకాల అనుమతులకు సంబంధించిన వ్యవహారాన్ని హెచ్ఎండీఏ నిర్వహించనుంది. భూములకు నిర్ధిష్టమైన ధరలు, అమ్మకందారులు, కొనుగోలుదారులకు పూర్తి స్థాయిలో భరోసా, స్థిరాస్తుల పెట్టుబడులు శాశ్వత ప్రాతిపదికన భద్రత దక్కనుంది.