కొండాపూర్, జూన్ 9 : కడుపులోకి బుల్లెట్ దూసుకువెళ్లిన ఓ వ్యక్తికి అరుదైన చికిత్స చేసిన హైటెక్‌సిటీ మెడికవర్ దవాఖాన వైద్యులు ప్రాణాలు కాపాడారు. గురువారం దవాఖానలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వైద్యులు మోకా ప్రణీత్ వివరాలను వెల్లడించారు. ఫిబ్రవరి నెలలో యెమెన్ దేశంలో జరిగిన ఓ ఘటనలో 35 ఏండ్లున్న ఓ వ్యక్తి కడుపు కుడివైపు నుంచి బుల్లెట్ దూసుకెళ్లింది. బాధితుడికి యెమెన్ దేశంలో చికిత్స చేశారు. అయినా.. నయం కాలేదు. ఆరోగ్య పరిస్థితి కూడా విషమించింది. దీంతో, అక్కడి వైద్యుల సలహా మేరకు బంధువులు అతడిని మెడికవర్ దవాఖానకు తీసుకువచ్చారు.
అనంతరం మెడికవర్ వైద్యులు పరీక్షలు నిర్వహించారు. రోగి తీసుకున్న ఆహారం కడుపు భాగంలో ఉన్న గాయం నుంచి బయటకు వస్తున్నట్లు గుర్తించారు. రోగిని పరిశీలించిన గ్యాస్ట్రోఎంట్రాలజీ బృందం అవసరమైన పరీక్షలను నిర్వహించి, గ్యాస్ట్రిక్ లీకేజీని అరికట్టేందుకు చికిత్స చేశారు. రోగి ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ఎండోస్కోపిక్ చికిత్స ఉత్తమమని భావించారు.
ఎండోస్కోపింగ్ స్టెంటింగ్ విధానాన్ని అమలు చేసి రోగి ప్రాణాలు కాపాడారు. ప్రపంచంలోనే మొదటి సారిగా ఎండోస్కోపిలో అరుదైన రకం ‘ఈసోఫాగోడ్యుయోడెనాల్’ స్టెంటింగ్ ద్వారా లీకేజీలను సంపూర్ణంగా అడ్డుకోవడంలో వైద్యులు విజయవంతమయ్యారు. ప్రస్తుతం రోగి పరిస్థితి మెరుగుపడింది. పూర్తి స్థాయిలో కోలుకోవడంతోపాటు నోటి ద్వారా ఆహారం తీసుకుంటున్నారు. రోగికి చికిత్స అందించిన బృందంలో రేడియో డయాగ్నోసిస్ హెడ్ డాక్టర్ విజయ్ కుమార్, సీనియర్ సర్జన్ డాక్టర్ శరత్‌కుమార్ రెడ్డి, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.