రంగారెడ్డి జిల్లా కోర్టులు, జూన్9 (నమస్తే తెలంగాణ): ఈనెల 26 జరగబోయే జాతీయ లోక్ అదాలత్‌ను విజయవంతం చేయాలని అధికారులతో జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి హరేకృష్ణ భూపతి సమన్వయ సమావేశం నిర్వహించారు. రంగారెడ్డి జిల్లా పరిధిలోని పోలీసు అధికారులు, ప్రభుత్వ న్యాయవాదులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్, ఇన్సూరెన్స్ అధికారులు, బార్ అసోసియేషన్ సభ్యులకు పలు సూచనలు చేశారు.
కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న పరిష్కరించదగిన కేసులను గుర్తించి ఇరువర్గాలకు ఆమోదయోగ్యమైన పరిష్కారం చూపాలన్నారు. రాజీకి వీలయ్యే క్రిమినల్ కేసులను పరిష్కరించాలని ఆయన సంబంధిత అధికారులను కోరారు. కేసులతో సంవత్సరాల తరబడి కోర్టుల చుట్టూ తిరగకుండా కక్షిదారులు రాజీ చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో న్యాయసేవా సంస్థ కార్యదర్శి శ్రీదేవి, ప్రభుత్వ న్యాయవాది జి.రాజేశ్వర్‌రావు, పీపీ కొంగర రాజిరెడ్డి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు భాస్కర్‌రెడ్డి, పోలీసు అధికారులు, పారా లీగల్ వలంటీర్లు పాల్గొన్నారు.