HYD Rain Alert | హైదరాబాద్‌లో రాబోయే గంటలో హైదరాబాద్‌లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఇప్పటికే మధ్యాహ్నం నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. దీంతో రోడ్లపై పలుచోట్ల వర్షం నీరు నిలిచింది. పలువురు వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. మరో వైపు సాయంత్రం 6 గంటల వరకు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ పేర్కొంది. ఈ క్రమంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ కోరింది. అందరూ అప్రమత్తంగా ఉంటూ.. అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని చూపింది.
మరో వైపు నగరంలోని పలుచోట్ల వర్షం కురుస్తున్నది. సుచిత్ర, గుండ్లపోచంపల్లి, బహదూర్‌పల్లి, సూరారం, కొంపల్లి, చింతల్, కండ్లకోయ, కృష్ణాపూర్, దుండిగల్, గాగిల్లాపూర్, గౌడవల్లి, మునీరాబాద్, డబిల్పూర్ వర్షం పడుతున్నది. వర్షం నేపథ్యంలో పలుచోట్ల ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. దీంతో ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగి.. ట్రాఫిక్‌ను క్లియర్ చేస్తున్నారు. ఇక రాగల నాలుగు రోజుల్లో హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. పలుచోట్ల ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని హెచ్చరించింది.