Hyderabad | మాదాపూర్, మార్చి 25: మళ్లీ తాగొచ్చావా! అని భార్య, కూతురు నిలదీయడమే తప్పైపోయింది. రోజంతా కష్టపడి వచ్చిన నన్నే నిలదీస్తారా? అని ఆ భర్త ఆవేశానికి పోయాడు. కుటుంబసభ్యుల మీదకు అరిచి ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. గొడవ తర్వాత రాత్రిపూట అలా కోపంతో ఇంట్లో నుంచి వెళ్లిపోయిన అతను.. రెండు రోజులు అయినా ఇంటికి తిరిగిరాలేదు. దీంతో కంగారుపడిపోయిన భార్య మియాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రేమ్ నగర్ పి బ్లాక్లో బానోతు శ్రీను అనే వ్యక్తి తన భార్య, కూతురుతో నివసిస్తున్నాడు. కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఎప్పటిలాగే ఈ నెల 23వ తేదీన కూడా కూలీ పని ముగించుకుని సాయంత్రం 7 గంటల ప్రాంతంలో బానోతు శ్రీను ఇంటికి వచ్చాడు. అయితే వచ్చేప్పుడు మద్యం సేవించి రావడంతో శ్రీను భార్య లలిత, కూతురు అతన్ని మందలించారు. వారి మధ్య వాగ్వాదం కూడా జరిగింది.
దీంతో ఆగ్రహానికి గురైన బానోతు శ్రీను రాత్రి 11 గంటల సమయంలో ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. కుటుంబసభ్యులు ఎంత బతిమిలాడినా వినిపించుకోకుండా బయటకు వెళ్లాడు. తెల్లారి వస్తాడేమో అనుకుంటే ఆ రోజు కూడా ఇంటికి రాలేదు. దీంతో కంగారుపడిన కుటుంబసభ్యులు శ్రీను కోసం బంధువులు, తెలిసిన వారిని ఆరా తీశారు. అయినప్పటికీ ఆచూకీ లభించకపోవడంతో కంగారుపడి మియాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తుచేస్తున్నారు.
బానోతు శ్రీను 5.1 అడుగుల ఎత్తు, ఎరుపు రంగు శరీర ఛాయ ఉంటాడని.. కనిపించకుండా పోయినప్పుడు నలుపు రంగు ప్యాంట్, గోధుమ రంగు షర్ట్ ధరించి ఉన్నాడని అతని కుటుంబసభ్యులు ఫిర్యాదులో పేర్కొన్నారు. తెలుగు, హిందీ, లంబాడా భాషలు మాట్లాడతాడని తెలిపారు.