Hyderabad | మైలార్‌దేవ్‌పల్లి, జూన్ 7: భార్యాభర్తల మధ్య గొడవ పక్కింటి యువతి ప్రాణాల మీదకు తెచ్చింది. దంపతులు ఇద్దరూ గొడవపడుతుండటంతో ఆపేందుకు వెళ్లిన ఆమెను తన భార్య అనుకుని భర్త కత్తితో పొడిచాడు. దీంతో తీవ్రంగా గాయపడిన యువతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నది. హైదరాబాద్‌లోని మైలార్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం రాత్రి ఈ సంఘటన చోటు చేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్రలోని నాందేడ్‌కు చెందిన సలీమ్ (60), రేష్మ దంపతులు. వీరికి ఇద్దరు సంతానం. ఒకరు మానసిక వ్యాధితో బాధపడుతుండగా.. మరో కూతురు హైదరాబాద్ మైలార్‌దేవ్‌పల్లి డివిజన్లోని టీఎన్జీవోస్ కాలనీలో ఉంటుంది. బక్రీద్ పండుగ నేపథ్యంలో సలీమ్ దంపతులు హైదరాబాద్‌లోని కూతురు ఇంటికి వచ్చారు. శుక్రవారం రాత్రి సలీమ్ మద్యం సేవించి వచ్చి భార్యతో గొడవపడ్డాడు. రేష్మను చంపేస్తానని కూరగాయాలు కోసే కత్తితో బెదిరించాడు. ఈ క్రమంలో రేష్మపై దాడికి యత్నించడంతో ఆమె అక్కడి నుంచి బయటకు పరుగులు తీసింది.
భార్యాభర్తలు బిగ్గరగా అరుస్తుండటంతో వారి గొడవను ఆపేందుకు పక్కింట్లో ఉంటున్న జుబేదా (26) అక్కడకు వెళ్లింది. అయితే జుబేదా వచ్చిన విషయం గమనించని సలీమ్.. తన భార్య రేష్మ అనుకొని ఆమెను కత్తితో కడుపులో పొడిచాడు. దీంతో తీవ్ర రక్తస్రావమైన జుబేదా అక్కడే పడిపోయింది. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు జుబేదాను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.