మల్కాజిగిరి, జూన్ 10 : కొంత కాలంగా భార్యపై అనుమానం పెంచుకొని వేధింపులకు పాల్పడుతున్న భర్త చివరకు ఆమెను గన్‌తో కాల్చి చంపిన ఘటన మల్కాజిగిరిలో సంచలనం సృష్టించింది. మల్కాజిగిరి పోలీసులు, హతురాలి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. మల్కాజిగిరిలోని మారుతీనగర్‌లో నివాసముండే దామర అరుణ్‌కుమార్‌తో 20 ఏండ్ల కిందట స్వర్ణలతతో వివాహమైంది. వీరికి కుమార్తె, కుమారుడు సంతానం. కాగా, కుమార్తె 2017లో గోడ కూలిన ప్రమాదంలో మృతి చెందింది. అనంతరం అరుణ్‌కుమార్ తన భార్య సోదరి అయిన నిషారాణిని ప్రేమించి రెండో వివాహం చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న స్వర్ణలత భర్త ఇంటి నుంచి పుట్టింట్లో ఉంటుంది. నిషారాణితో వివాహం చేసుకున్న అరుణ్‌కుమార్ కొన్నళ్లపాటు బాగానే ఉన్నా అనంతరం ఆమెపై అనుమానం పెంచుకున్నాడు. తరుచూ దుర్భాషలాడుతూ శారీరకంగా, మానసికంగా వేధించడం ప్రారంభించారు. ఈ వేధింపులు తట్టుకోలేక నిషారాణి మెదక్ జిల్లా నర్సాపూర్‌లో నివాసించే తన బంధువులకు విషయం చెప్పుకొని ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో పెద్దల సమక్షంలో పంచాయితీలు జరిగాయి. భార్యను బాగా చూసుకుంటానంటూ అరుణ్‌కుమార్ హామీ ఇచ్చి తిరిగి మల్కాజిగిరిలోని తన ఇంటికి తీసుకొచ్చాడు.
ఈ ఏడాది మార్చిలో అరుణ్‌కుమార్ అక్రమంగా తన వద్ద పిస్టోల్ కలిగి ఉండడంతో అంబర్పేట్ పోలీసులకు పట్టుబడ్డాడు. ఈ మేరకు పోలీసులు అరుణ్‌కుమార్‌తో పాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేసి, గన్ను స్వాధీనం చేసుకున్నారు. ఆ సమయంలో తన భార్యను హత్య చేసేందుకే గన్ కొన్నానని పోలీసుల విచారణలో వెల్లడించాడు. దీంతో నిందితుడిని అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. నెల రోజుల పాటు జైల్లో ఉండి ఇటీవల బెయిల్‌పై అరుణ్‌కుమార్ బయటకు వచ్చాడు. జైలు నుంచి బయటకు వచ్చిన నర్సాపూర్‌లో ఉన్న తన భార్య నిషారాణిని తిరిగి మల్కాజిగిరికి తీసుకొచ్చాడు. ఆ తరువాత తిరిగి ఆమెపై శారీరక, మానసిక వేధింపులు కొనసాగించాడు. గత ఐదు రోజుల నుంచి కూడా గొడవలు కొనసాగుతుండగా, గుర్తుతెలియని వ్యక్తుల నుంచి రివాల్వర్‌ను కొనుగోలు చేశాడు. బుధవారం తెల్లవారుజామున ఉషారాణిని తన వద్ద ఉన్న గన్‌తో కాల్చి చంపి పరారయ్యాడు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు మల్కాజిగిరి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.