హైదరాబాద్: హైదరాబాద్ (Hyderabad) బేగంబజార్లో దారుణం చోటుచేసుకున్నది. భార్య, కుమారుడిని చంపిన భర్త.. తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. ఉత్తరప్రదేశ్ నుంచి నగరానికి వలస వచ్చిన సిరాజ్ అలీ.. తన కుటుంబంతో కలిసి బేగంబజార్లో ఉంటున్నాడు. అయితే గురువారం అర్ధరాత్రి తర్వాత భార్య హేలియను గొంతుకోసి చంపాడు. అనంతరం కుమారుడు హైజాన్ను గొంతు నులిమి హతమార్చాడు. చివరికి అతడు కూడా ఉరివేసుకుని చనిపోయాడు.
తల్లి, తమ్ముడిని చంపడం చూసిన అతని పెద్ద కుమారుడు భయంతో ఇంటినుంచి పారిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని ఉస్మానియా దవాఖానకు తరలించారు. కుటుంబ కలహాలే దీనికి కారణమని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. హత్యకు ముందు సిరాజ్ రాసిన సూసైడ్ నోటును స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.