శేరిలింగంపల్లి: నడిరోడ్డుపై గర్భవతిగా ఉన్న భార్యను బండరాయితో కొట్టి చంపేందుకు యత్నించాడు భర్త. తీవ్రంగా గాయపడిన బాధితురాలు కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. పోలీసుల కథనం ప్రకారం… వికారాబాద్‌కు చెందిన ఎండీ బస్రత్ (32), షబానా పర్వీన్(22) దంపతులు హఫీజ్ పేట్ ఆదిత్యనగర్‌లో ఉంటున్నారు. ప్రస్తుతం షబానా పర్వీన్ రెండు నెలల గర్భిణి కాగా, మార్చి 29న పర్వీన్ అస్వస్థతకు గురికావడంతో కొండాపూర్ రాఘవేంద్రకాలనీలోని ఓ ఆసుపత్రిలో చేర్పించారు.
పర్వీన్‌ను ఏప్రిల్ 1న రాత్రి డిశ్చార్జ్ చేశారు. ఆసుపత్రి బయటకు రావడంతోనే, హాస్పిటల్ ముందే దంపతుల మధ్య గొడవ జరిగింది. నడిరోడ్డుపై పెనుగులాటలో కిందపడిన పర్వీన్‌పై బస్రత్ బండరాయితో దాడి చేశాడు. దాదాపు 10 నుంచి 12 సార్లు రాయితో మోదడంతో పర్వీన్ తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితికి వెళ్లింది. చనిపోయిందని భావించిన బస్రత్.. అక్కడి నుంచి పారిపోయాడు. గచ్చిబౌలి పోలీసులు కొన ఊపిరితో ఉన్న పర్వీన్‌ను చికిత్స కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కోమాలో ఉన్న పర్వీస్ నిమ్స్‌లో చికిత్స పొందుతున్నది. పోలీసులు నిందితుడు బస్రత్ను ఈనెల 3న అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.