బేగంపేట్, ఏప్రిల్ 5: ప్రేమ పేరుతో ఓ యువతిని నమ్మించి మోసంచేసి వివాహం చేసుకున్నాడు… ఆ తర్వాత తన స్నేహితులతో కలిసి మొదటి రాత్రే సదరు యువతిపై లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనకు సంబంధించి తొలుత కూకట్పల్లి పోలీస్‌స్టేషన్‌లో జీరో ఎఫ్ఐఆర్ నమోదుకాగా తదుపరి కేసు విచారణ నిమిత్తం బేగంపేట్ పోలీసుస్టేషన్‌కు బదిలీ అయింది. ఇన్స్పెక్టర్ సైదులు వివరాల ప్రకారం..కూకట్‌పల్లిలో నివాసం ఉండే ఓ మహిళకు ఇద్దరు కుమార్తెలు. వారికి ఉన్న భవనంలో ఖాళీగా ఉండే మడిగెను కిరాయి ఇవ్వాలని నో బ్రోకర్ డాట్.కాం వెబ్సైట్లో పెట్టింది. దీన్ని గమనించిన ఏపీ, నెల్లూరు ప్రాంతానికి చెందిన షేక్ నవాజ్(28) తనకు మడిగె అద్దెకు కావాలని తీసుకున్నాడు.
కొద్ది రోజుల తర్వాత ఇంటి ఓనర్ పెద్ద కూతురు (22)ను పరిచయం చేసుకొని ప్రేమిస్తున్నానంటూ నమ్మబలికాడు.. మీరు మా మతం కాదు.. నేనే ప్రేమించను అని ఆ యువతి చెప్పడంతో లేదు నేను కూడా మీ మతంలోకి మారాను అని సర్టిఫికెట్లు కూడా చూపించాడు. ఓ రోజు బేగంపేట్ ప్రకాశ్‌నగర్‌లో ఓ ఫ్లాట్‌ను అద్దెకు తీసుకున్నాను..వచ్చి చూడాలని చెప్పగా ఆమె వెళ్లింది . అక్కడ ఆమెకు కూల్ డ్రింక్‌లో మత్తు మందు ఇచ్చి సృహా కోల్పోయాక తన స్నేహితులతో కలిసి లైంగికదాడికి పాల్పడ్డాడు. అంతకు ముందు మోయినాబాద్లో కూడా ఓ గదిలో కూడా స్నేహితులతో కలిసి లైంగికదాడికి పాల్పడ్డాడు. ఆ సమయంలో యువతిని బెదిరించి ఎవరికైన చెబితే కుటుంబ సభ్యులను చంపేస్తానని బెదిరించాడు. అటుపై ప్రేమతో పెళ్లి చేసుకోవాలనే నేను ఇవన్నీ చేశాను..
అని నమ్మించి గత యేడాది 28న కూకట్‌పల్లిలో వివాహం చేసుకున్నాడు. అటుపై మొదటి రాత్రి కూడా ఇదే మాదిరిగా మత్తు మందు ఇచ్చి స్నేహితులతో కలిసి లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ క్రమం లో సదరు యువతి నుంచి లక్షలాది రూపాయలు, బంగారం కూడా వాడుకున్నట్టు తెలిసింది. ఈ యేడాది జనవరి నుంచి నవాజ్ కనిపించకుండా పోయాడు. దీంతో ఆ యువతి నవాజ్ కోసం తెలుసుకునే క్రమంలో అతనికి గతంలో మూడుసార్లు పెళ్లిళ్లు అయ్యాయని తెలిసింది. దీంతో బాధిత యువతి కూకట్పల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో అక్కడ జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి.. అంతకుముందు బేగంపేట్ ప్రకాశ్‌నగర్‌లో ఆ యువతిపై లైంగిక దాడికి పాల్పడటంతో కేసును బేగంపేట్ పోలీసులకు బదిలీ చేశారు. పోలీసులు నిందితుడి కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నట్టు ఇన్స్పెక్టర్ తెలిపారు.