Hyderabad | మెహిదీపట్నం, ఏప్రిల్ 21: డబ్బులను సులభంగా సంపాదించాలనుకునే వేరే రాష్ట్రం నుంచి గంజాయి తెచ్చి విక్రయిస్తున్న నలుగురు సభ్యుల ముఠాను హుమాయూన్ నగర్ పోలీసులు సోమవారం పశ్చిమ మండలం ట్రాన్స్‌పోర్టు పోలీసులతో కలిసి పట్టుకున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ మాసాబ్ ట్యాంక్ భోళా నగర్‌కు చెందిన రౌడీ షీటర్ మహ్మద్ సోఫియోద్దీన్ అలియాస్ సోఫియాన్ (24).. మాసాబ్ ట్యాంక్ పోచమ్మ బస్తీకి చెందిన సయ్యద్ దావూద్ అలీ(26), హుమాయూన్ నగర్‌కు చెందిన సయ్యద్ రోమన్ (26), బహదూర్‌పురా కిషన్‌బాగ్‌కు చెందిన మహమ్మద్ అయూబ్(22)తో కలిసి మహారాష్ట్ర నాగ్‌పూర్ నుంచి గంజాయి తెచ్చి విక్రయిస్తున్నాడు. గంజాయి విక్రయిస్తున్నట్లు సోమవారం నాడు విశ్వసనీయ సమాచారం అందుకున్న పశ్చిమ మండలం టాస్క్‌ఫోర్స్ పోలీసులు, హుమాయూన్ పోలీసులు ఫస్ట్ లాన్సర్‌లో పట్టుకున్నారు. నిందితుల నుంచి రెండు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా గంజాయికి బానిసలు కావద్దని యువతకు పోలీసులు సూచించారు.