Human Trafficking | చార్మినార్, ఫిబ్రవరి 24 : హైదరాబాద్‌లోని చాదర్‌ఘాట్‌లో మానవ అక్రమ రవాణా ముఠా గుట్టు రట్టయ్యింది. విదేశాల నుంచి అమ్మాయిలను నగరానికి తీసుకొచ్చి విక్రయాలు జరుపుతున్న ముఠా సభ్యులను సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్, చాదర్‌ఘాట్ పోలీసులు సంయుక్తంగా అదుపులోకి తీసుకున్నారు.
చాదర్‌ఘాట్ సమీపంలోని మూసా నగర్ కేంద్రంగా మహిళల అక్రమ రవాణా జరుగుతుందని సౌత్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులకు సమాచారం అందింది. దీంతో సోమవారం నాడు చాదర్‌ఘాట్ పోలీసులతో కలిసి ఆకస్మిక దాడులు చేసి ముఠాను పట్టుకున్నారు. బంగ్లాదేశ్‌కు చెందిన ఈ ముఠాలో నలుగురు మహిళలు, నలుగురు పురుషులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అధిక సంపాదనకు ఆశపడిన సభ్యులు మహిళలను అక్రమంగా రవాణా చేస్తున్నట్లు గుర్తించారు.
ఈ క్రమంలోనే ఉద్యోగాలు కల్పిస్తామని మాయమాటలు చెప్పి మయన్మార్ నుంచి యువతులు, బాలికలను హైదరాబాద్‌కు ఈ ముఠా సభ్యులు తెచ్చినట్లు గుర్తించారు. అలా హైదరాబాద్‌కు తీసుకొచ్చిన తర్వాత వారిని ఒక గదిలో బంధించి.. తాము చెప్పినట్లు వినాలని, లేదంటే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని భయపెడుతూ అమ్మకాలు చేపట్టేవారని తెలుసుకున్నారు. ఈ ముఠా సభ్యులు ఇప్పటివరకు ఎంతమందిని, ఎక్కడెక్కడ అమ్మకాలు పాల్పడ్డారో విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు.