Human Skeleton | నాంపల్లి మార్కెట్ ప్రాంతంలోని ఓ ఇంట్లో మనిషి అస్థిపంజరం వెలుగు చూడడం స్థానికంగా కలకలం సృష్టించింది. వీడియో చూపిస్తానంటూ పాడుబడ్డ ఇంట్లోకి వెళ్లిన యువకుడు.. ఇంటి లోపలకి వెళ్లి మనిషి అస్థిపంజరం చూపిస్తూ వీడియో రికార్డ్ చేశాడు. అస్థిపంజరాన్ని రికార్డు చేసి వీడియోను ఫేస్బుక్లో పెట్టడంతో అదికాస్త వైరల్‌గా మారింది. ఇది పోలీసుల దృష్టికి రావడంతో సదరు యువకుడిని పోలీసులు విచారించారు. క్రికెట్ బాల్ ఇంట్లో పడడంతో తీసుకునేందుకు వెళ్లినట్లు సదరు యువకుడు పోలీసులకు తెలిపారు. అస్థిపంజరం కనిపించడంతో మర్నాడు వీడియో తీసినట్లు పోలీసులకు చెప్పుకొచ్చాడు. ఘటనా స్థలానికి చేరుకొని ఆధారాలను క్లూస్‌టీమ్, పోలీసులు సేకరిస్తున్నారు. అయితే, పాడుబడ్డ ఇంట్లో ఏడేళ్లుగా ఎవరూ లేరని స్థానికులు పేర్కొన్నారు. అయితే, ఈ అస్థిపంజరం ఎవరిది అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.