పటాన్ చెరు, సెప్టెంబర్ 26: సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో (Patancheru) అర్ధరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తున్నది. దీంతో హైదరాబాద్-ముంబై 65వ జాతీయ రహదారిపైకి వరద నీరు చేరడంతో పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. అప్రమత్తమైన ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్‌ను క్లియర్ చేస్తున్నారు. కాగా, భారీ వర్షాలతో పటాన్ చెరులో 62 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. రామచంద్రపురంలో 50.8 మిల్లీమీటర్లు, అమీన్పూర్లో 60 మిల్లీమీటర్లు, జిన్నారం 59.7 మిల్లీమీటర్లు, గుమ్మడిదల 48.4 మిల్లీమీటర్ల వర్షం వర్షపాతం నమోదయింది.
భారీ వర్షం కురవడంతో పటాన్‌చెరూ నియోజకవర్గంలోని రోడ్లన్నీ జలమయమయ్యాయి. దీంతో పలుచోట్ల జాతీయ రహదారిపై ట్రాఫిక్ నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాలనీలోని రోడ్లన్నీ జలమయమయ్యాయి. ముత్తంగి గ్రామంలోని రైస్ మిల్ రోడ్డు వరదనీటిలో మునిగిపోయి కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 65వ జాతీయ రహదారిపై విస్తరణ పనులు జరుగుతూ ఉండడంతో బ్రిడ్జిలు అనుమానం చేసే ప్రాంతంలో సర్వీస్ రోడ్లు ఏర్పాటు చేయడంతో సర్వీసు రోడ్లపైకి భారీగా వరద నీరు చేరి వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.
కాగా, సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో స్థానిక మార్కెట్ యార్డులోకి వర్షపు నీరు చేరింది. కూరగాయల దుకాణాలు నీటమునిగాయి. వర్షం ప్రభావంతో డ్రైనేజీ పొంగడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. మార్కెట్ సమస్య గురించి అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని వ్యాపారులు వాపోతున్నారు. వర్షం కారణంగా సంగారెడ్డి నుంచి ముత్తంగి వరకు భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. రోడ్డు విస్తరణ నేపథ్యంలో ఇస్నాపూర్ రుద్రారం వద్ద జాతీయ రహదారిపై నీరు నిలిచిపోయింది.