Hyderabad | కుత్బుల్లాపూర్, ఫిబ్రవరి 17: హైదరాబాద్లోని సుచిత్రలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ట్రాఫిక్ పోలీసుల నిర్లక్ష్యం కారణంగా కొంపల్లి నుంచి సుచిత్ర వైపు వచ్చే మార్గం గుండా వెళ్లే వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. భారీగా ట్రాఫిక్ స్తంభించడంతో సుమారు రెండు కిలోమీటర్ల మేరా వాహనాలు ఎక్కడికి అక్కడే నిలిచిపోయాయి.
44వ నెంబర్ జాతీయ రహదారిపై జరుగుతున్న రహదారి పనుల కారణంగా మేడ్చల్ వెళ్లే రహదారిపై నిత్యం ట్రాఫిక్ రద్దీ కొనసాగుతోంది. అయితే ఇవాళ ఆల్వాల్ ట్రాఫిక్ పోలీసులు విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో సాయంత్రం సమయంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడిందని వాహనదారులు మండిపడుతున్నారు. సుమారు రెండు గంటలుగా వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడిందని అసహనం వ్యక్తం చేస్తున్నారు.