సిటీబ్యూరో, ఫిబ్రవరి 22 (నమస్తే తెలంగాణ): డ్రంక్ అండ్ డ్రైవ్ (డీడీ)కు సంబంధించిన పెండింగ్ కేసుల పరిష్కారంపై న్యాయస్థానం దృష్టి సారించింది. సత్వర పరిష్కారం కోసం విధించిన జరిమానాలను తగ్గిస్తున్నాయి. రూ.10 వేల జరిమానా కట్టాల్సిన వారికి.. రూ.2 వేలకు పరిమితం చేస్తున్నాయి. గతేడాది డిసెంబర్ 31 వరకు పెండింగ్‌లో ఉన్న డీడీ కేసులకు మాత్రమే ఈ తగ్గింపు వర్తిస్తుంది. డీడీలో పట్టుబడ్డ వారికి కోర్టులు ఏడాదిన్నర కాలంగా రూ.10 వేలు జరిమానా విధిస్తున్నాయి. భారీ జరిమానాలకు బయపడిన చాలా మంది కోర్టులకు హాజరు కాకపోవడంతో పెండెన్సీ పెరుగుతూ వస్తుంది. గత ఐదేండ్లుగా పెండింగ్‌లో ఉన్న కేసులన్నింటినీ పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటున్నారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో సుమారు 70 వేలకు పైగా డీడీ కేసులు పెండింగ్‌లో ఉన్నట్టు తెలిసింది.
భారీ జరిమానాలతో భయపడిన చాలా మంది తమ కేసుల పరిష్కారం కోసం ముందుకొస్తున్నారు. తమపై డీడీ కేసు ఉందంటూ ఆయా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లకు వెళ్లి హాజరవుతున్నారు. ఈ అవకాశం మార్చి 11 వరకు మాత్రమే ఉండటంతో చాలా మంది ముందుకొస్తున్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పోలీసులు సైతం ఫోన్లు చేసి వివరిస్తున్నారు.
మద్యం మత్తులో కొందరు వాహనాలు నడిపిస్తూ బాటసారుల ప్రాణాలు తీస్తున్నారు. దీంతో పలు కుటుంబాల్లో విషాదాన్ని నింపుతున్నారు. ఈ తరహా రోడ్డు ప్రమాదాలపై దర్యాప్తు చేసిన సైబరాబాద్ లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ పోలీసులు మంగళవారం ముగ్గురు నిందితులను జైలుకు పంపారు. వీరందరిపై ఐపీసీ 304 పార్ట్-2 సెక్షన్ల కింద అభియోగాలను నమోదు చేశారు. ఈ అభియోగాలు రుజువైతే నిందితులకు పదేండ్ల జైలు శిక్ష ఖాయమని అధికారులు పేర్కొన్నారు. మత్తులో వాహనాలు నడపకండి.. ఇతరుల ప్రాణాలు తీయకండి.. మీ భవిష్యత్తును జైలు పాలు చేసుకోకండి.. అంటూ సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు పౌరులకు విజ్ఞప్తి చేస్తున్నారు.
దినేశ్ కరణ్ కుమార్‌జైన్ (26) మద్యం మత్తులో బ్యాలినో కారును వేగంగా నడిపాడు. శంషాబాద్ సింప్లెక్స్ దగ్గర యూటర్న్‌లో మరో వాహనాన్ని ఢీకొట్టడంతో 21 ఏండ్ల యువకుడు ఎర్రోళ్ల చంద్రశేఖర్ మృతి చెందాడు. ఈ ప్రమాదం డ్రంక్ అండ్ డ్రైవింగ్ వల్లే జరిగిందని నిర్ధారించిన పోలీసులు దినేశ్‌ను అరెస్టు చేసి, కోర్టులో హాజరుపర్చారు.
మద్యం మత్తులో ద్విచక్ర వాహనాన్ని వేగంగా నడిపి మేడ్చల్ సాయిబాబా కాలనీ వద్ద మరో బైక్‌ను ఢీ కొట్టాడు అంతోళ్ల రాజశేఖర్. ఫిబ్రవరి 7న జరిగిన ఈ ప్రమాదంలో 77 ఏండ్ల మిర్జా యూసుఫ్ అలీ బేగ్ మృతి చెందాడు. రాజశేఖర్ అరెస్టు చేసి, కోర్టులో హాజరుపర్చారు.
పాశం ప్రీతం.. టాటా ఏస్ ఆటో డ్రైవర్. రాజేంద్రనగర్ పరిధిలో తాగిన మత్తులో ఆటోను అతి వేగంగా.. నిర్లక్ష్యంగా నడిపి ఆగి ఉన్న డీసీఎంను ఢీకొట్టాడు. ఈ సంఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న 18 ఏండ్ల యువకుడు మృతి చెందాడు. పాశం ప్రీతంను అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ సంఘటన 18న రాజేంద్రనగర్‌లో జరిగింది.
సిటీ పోలీసులు ఇకనుంచి 24 గంటలూ డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించనున్నారు. పట్టుబడితే చర్యలు తీసుకుంటున్నారు. నగరంలో ఎక్కువ ప్రమాదాలు అర్ధరాత్రి తర్వాతే జరుగుతున్నాయి. ఈ ప్రమాదాలు కూడా మద్యం మత్తు, అతివేగంగా వాహనాలు నడపడం వల్లే జరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇలాంటి ప్రమాదాలను నివారించేందుకు నిరంతరం డ్రంక్ అండ్ డ్రైవ్ చేపట్టాలని పోలీసు అధికారులు నిర్ణయించారు. ఇందులో భాగంగానే ఈ ఏడాది నుంచి నిరంతర డ్రంక్ అండ్ డ్రైవ్‌కు శ్రీకారం చుట్టారు.
నగరంలో జరుగుతున్న ప్రమాదాలపై పోలీసు అధికారులు అధ్యయనం చేశారు. అతివేగం, మద్యం మత్తులో డ్రైవింగ్ చేయడం వల్లే జరుగుతున్నట్లు వారు గుర్తించారు. మద్యం మత్తులో డేంజరస్ డ్రైవింగ్ చేస్తుంటారని, ఆ సమయంలో పాదచారులను ఢీకొట్టడం, స్వతహాగా డివైడర్లను, ఎదురుగా వస్తున్న వాహనాలను ఢీకొట్టి ప్రమాదాల బారిన పడుతున్నారని తెలిపారు. ఇలాంటి ఘటనల్లో వాహనం నడుపుతున్న వారితో పాటు ఇతరులు కూడా ప్రమాదానికి గురవుతున్నారన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది సూసైడ్ బాంబర్ లాంటిందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. మద్యం తాగి వాహనం నడిపే వారి పట్ల కఠినంగా ఉండాలని ట్రాఫిక్ ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఇందులో భాగంగానే అర్ధరాత్రి 12 నుంచి ఉదయం 5 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి రాత్రి 12 గంటల వరకు ప్రత్యేక ఫోకస్ పెడుతున్నట్లు పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ఇకపై అన్ని ప్రాంతాల్లో 24 గంటలూ డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు.