సిటీబ్యూరో, సెప్టెంబర్ 23(నమస్తే తెలంగాణ): హుస్సేన్ సాగర్ పరిసరాలు భక్త జన సంద్రమవుతున్నాయి. గణేశ్ నిమజ్జనాలతో కోలాహలంగా మారుతున్నాయి. శనివారం సైతం భారీ సంఖ్యలో వినాయక ప్రతిమలను సాగర్లో నిమజ్జనంచేశారు. ఈ సందర్భంగా భక్తుల బృందం ఇలా సందడి చేసింది.
ఖైరతాబాద్ శ్రీ దశ మహా విద్యా గణపతిని శనివారం నగర వ్యాప్తంగా పలువురు భక్తులు దర్శించుకొని అనేక పూజాధికాలు చేశారు. హైకోర్టు జడ్జి ఈవీ వేణుగోపాల్, స్టాంప్స్, రెవెన్యూ శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ దంపతులు, సమాచార శాఖ డైరెక్టర్ రాజమౌళిలు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మీడియా ఫ్రెండ్స్, వివేకానంద సేవా సమితి ఆధ్వర్యంలో 2వేల మందికి ప్రసాద పంపిణీ కార్యక్రమాన్ని వారు ప్రారంభించారు. కార్యక్రమంలో సమితి ప్రతినిధులు కె. శ్రీనివాస్, జి.ఉదయ భాస్కర్, నరేశ్, శ్రీధర్ రెడ్డి, మల్లన్న, వైకుంఠం, అద్విక్, రవీంద్ర తదితరులు పాల్గొన్నారు.
గణనాథునికి హోం మంత్రి పూజలు
పురానాపూల్లో బీఆర్ఎస్ హైదరాబాద్ పార్లమెంట్ ఇన్చార్జ్ పుస్తె శ్రీకాంత్ ఏర్పాటు చేసిన వినాయక మండపంలో రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ శనివారం ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మండప నిర్వాహకులు హోం మంత్రికి తీర్థ ప్రసాదాలు అందించి వినాయక జ్ఞాపికను బహుమతిగా అందించారు. కార్యక్రమంలో పెండ్యాల లక్ష్మణ్ రావు, ఇలియాస్ ఖురేషి, విష్ణు గౌడ్ పాల్గొన్నారు.
వినాయక నవరాత్రుల్లో భాగంగా గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నల్లగండ్ల అపర్ణ సరోవర్లో ఏర్పాటు చేసిన వినాయకుడి లడ్డూకు శనివారం వేలం పాట నిర్వహించారు. ఇందులో రాజేష్ వర్మ కుటుంబ సభ్యులు శాంతి ప్రియ, ఉమేష్ వర్మ, యశ్వితలు రూ.10,25,000లకు సొంతం చేసుకున్నారు.
గణనాథునికి 56 రకాల నైవేద్యాలు..
దిల్సుఖ్నగర్లోని హైదరాబాద్ – రంగారెడ్డి జిల్లాల రైస్ మిల్లర్స్ అసోసియేషన్ వినాయక మండపంలో వినాయక చవితి రజతోత్సవాలను(25వ) ఘనంగా శనివారం నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా 16 అడుగుల భారీ వినాయకునికి ప్రత్యేక పూజలు నిర్వహించి 56 పల్లేలలో 56 రకాల నైవేద్యాల్ని అర్పించారు. ఈ ఉత్సవాలకు మాజీ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి,
బీఆర్ఎస్ నాయకుడు క్యామ మల్లేష్లు హాజరయ్యారు.
టీఎన్జీవో, డీఎంహెచ్ఎస్ యూనిట్ అధ్యక్షుడు మామిడి ప్రభాకర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుడిని పలువురు అధికారులు సందర్శించి పూజలు చేశారు. అనంతరం, జరిగిన వేలం పాటలో లడ్డూను ఒక లక్షా 16 వేల రూపాయలకు రాష్ట్ర డైరెక్టర్ ఆఫ్ హెల్త్ డాక్టర్ గడల శ్రీనివాసరావు దక్కించుకున్నారు. చిత్రంలో టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్ష, కార్యదర్శులు రాజేందర్, జగదీశ్వర్, డీఎంహెచ్ఎస్ యూనిట్ అధ్యక్షుడు మామిడి ప్రభాకర్ తదితరులున్నారు.
గణనాథుడి రూపకల్పనలో వెరైటీ..
ఖైరతాబాద్, సెప్టెంబర్ 23: సోమాజిగూడలో కొలువుదీరిన ఈ గణనాథుడిని దర్శించుకొని భక్తులు ఆశ్చర్యంతో పాటు ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందుతున్నారు. సుమారు 11 అడుగుల ఎత్తైన ఈ వెరైటీ వినాయకుడి విగ్రహాన్ని తయారు చేసేందుకు అర్చకులు శ్రీను పర్యవేక్షణలో బళ్లారి, విజయవాడకు చెందిన 20 మంది ఆర్టిస్టులు 22 రోజుల పాటు శ్రమించారు. ఈ గణనాథుడి రూపకల్పనకు కాశీ నుంచి ప్రత్యేకంగా తెప్పించిన రెండ్నుర లక్షల రుద్రాక్షలను వినియోగించారు. అంతే కాదు ఐదు బస్తాల గరిక, 12 కేజీల ముత్యాలు, గుజరాత్ నుంచి తెప్పించిన 20 కేజీల నల్ల వొక్కలు 12 కేజీల పసుపు కొమ్మలు, 151 మక్కజొన్న కంకులు, ఐదున్నర కేజీల ఖర్జూర పండ్లు, బంగారు కిరీటం, గంటలతో రూపొందించిన జంధ్యం, దోవతి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ కె.ప్రసన్న రామ్మూర్తి దంపతులు ప్రతిష్టించిన ఈ వినాయకుడిని దర్శించుకోవడం వల్ల భక్తితో పాటు ఆరోగ్యం కూడా సిద్ధిస్తుందని చెబుతున్నారు.