సిటీబ్యూరో, జూలై 15 (నమస్తే తెలంగాణ): బాలాజీనగర్ సెక్షన్ పరిధిలో మల్కారం వద్ద ఓ వీధిలో 100కేవీ ట్రాన్స్ఫార్మర్ ఎలాంటి ఎస్టిమేషన్ లేకుండా రోడ్డుకు ఒకవైపు నుంచి మరోవైపునకు షిఫ్ట్ చేశారు. గతంలో ట్రాన్స్ఫార్మర్ ఉన్న ప్రాంతం వద్ద కొత్తగా ఏర్పాటైన నిర్మాణానికి సంబంధించిన వారు డీటీఆర్ అక్కడి నుంచి మార్చాలంటూ క్షేత్రస్థాయి సిబ్బందిని అడిగితే వారు తమ పై అధికారులను కలవాలని చెప్పడంతో పెద్ద ఎత్తున డీల్ కుదుర్చుకుని ఎలాంటి ఎస్టిమేషన్ లేకుండానే ఆ నిర్మాణానికి ఎదురుగా రోడ్డుకు అవతలవైపునకు మార్చారు. అయితే డీటీఆర్లు షిఫ్టింగ్ చేసే సమయంలో డిస్కం అధికారులు ఖచ్చితంగా లైన్లకు సంబంధించి, ఇతర విద్యుత్ సరఫరా అంశాలపై క్షేత్రస్థాయిలో పరిశీలించి ట్రాన్స్ఫార్మర్ స్థలమార్పిడి తప్పనిసరి అని నివేదిక ఇచ్చిన తర్వాత అధికారులు వేసిన ఎస్టిమేషన్ను ఆన్లైన్లో చెల్లించాలి. కానీ ఇక్కడ అలాంటిదేమీ లేదు. సబ్‌డివిజన్‌కు సంబంధించిన ముఖ్య అధికారి అనుకున్నారు.. కావలసింది ముట్టడం, పంపకాలు పూర్తవడంతో డీటీఆర్ షిఫ్టింగ్ పూర్తయింది.
జవహర్‌నగర్ మెయిన్‌రోడ్డుకు పక్కనే కీసర సబ్‌డివిజన్ పరిధిలోకి వచ్చే ఇదే సెక్షన్లో రోడ్డుపై ఉన్న పబ్లిక్ డీటీఆర్‌కు లోడ్ లేకున్నా ఆ ప్రాంతంలో 100కేవీ ఇంప్రూవ్మెంట్ ట్రాన్స్ఫార్మర్ కావాలంటూ పెట్టి ఓ ప్రైవేటు వెంచర్‌కు విద్యుత్ సరఫరా ఇస్తున్నారు. వెంచర్ యజమానులు డీటీఆర్ పెట్టుకోకుండా మేనేజ్ చేయడంతో పబ్లిక్ ట్రాన్స్ఫార్మర్ నుంచి ఎల్టీ లైన్ లాగి వెంచర్‌కు సరఫరా ఇస్తున్నారు. సాధారణంగా వెంచర్లో ప్లాట్లను బట్టి ఒక ప్లాట్‌కు 2 కిలోవాట్ల చొప్పున మొత్తం వెంచర్లో ఉన్న సంఖ్యను బట్టి కొత్త ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేయాలి. కానీ అలా కాకుండా ఈ వెంచర్‌కు పబ్లిక్ డీటీఆర్ నుంచి లైన్ ఇవ్వడంపై సబ్‌డివిజన్‌లో చర్చ జరుగుతోంది.
సిటీబ్యూరో, జూలై 15 (నమస్తే తెలంగాణ): నగర శివారు ప్రాంతమైన మేడ్చల్ జోన్ పరిధిలో ని హబ్సిగూడ సర్కిల్ కీసర సబ్‌డివిజన్‌లోని నాలుగు సెక్షన్లలో విద్యుత్ పరికరాలు, అనుమతు లు విషయంలో జోరుగా అక్రమాలు చోటుచేసుకుంటున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత కొన్ని రోజులుగా ఈ ప్రాంతంలో కొత్త వెంచర్లు వస్తుండటంతో వాటికి విద్యుత్ సరఫరా ఇవ్వడంలో చాలా అవకతవకలు జరుగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా కీసరకు సంబ ంధించిన కొందరు అధికారులు తమకు రావలసినది వస్తే చాలు సంస్థకు ఎంత నష్టం జరిగినా ఫర్వాలేదన్న ధోరణిలో ఎలాంటి ఎస్టిమేషన్లు లేకుండా, సంస్థకు సంబంధించిన మెటీరియల్‌ను ప్రైవేటు పనులకు కేటాయిస్తూ జేబులు నింపుకుంటున్నారు.
గతంలో కొన్ని వెంచర్లకు అక్రమంగా విద్యుత్ స్తంభాలు ఇచ్చారని, మెటీరియల్‌ను వినియోగించారన్న ఆరోపణలపై గత రెండునెలలుగా విజిలెన్స్ విచారణ జరుగుతోంది. విజిలెన్స్ విచారణ జరుగుతున్న సమయంలో కూడా మరికొన్ని అక్రమాలకు పాల్పడుతున్నారంటే ఈ అధికారులకు డిస్కంతో పాటు రాజకీయంగా పెద్ద స్థాయిలోనే అండదండలు ఉన్నాయంటూ ఎస్పీడీసీఎల్ ఉద్యోగులు చెప్పుకుంటున్నారు. ఫోకల్ పోస్టుకు రావడానికి ఎంత ఖర్చు పెట్టారో అంతకంటే పదిరెట్లు సంపాదించుకుని పోవడమే లక్ష్యంగా సబ్‌డివిజన్‌లోని కొందరు అధికారులు చేస్తున్న ఈ దందాకు కార్పొరేట్ ఆఫీసులోని ఒక కీలక అధికారి సహకరిస్తున్నారన్న చర్చ జరుగుతోంది. ఆ అధికారి అండదండలతోనే విజిలెన్స్ విచారణలు, తమపై డిస్కం ఉన్నతాధికారులకు వస్తున్న ఫిర్యాదులను లెక్కచేయకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ కావలసినది చేతికి ముడితే చాలు..సబ్ డివిజన్ మొత్తంలో ఏమైనా చేసుకోవచ్చన్న ధోరణిలో వ్యవహారం చేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రతీ పనిలో గోల్మాల్..
డీటీఆర్లు ఎస్టిమేషన్ లేకుండా వేరొకచోటకు మార్చడం, లైన్లకు సంబంధించిన వ్యవహారంలో గోల్మాల్, స్టోర్స్ నుంచి తెచ్చిన సామగ్రికి లెక్క లేకపోవడం వంటి విషయాల్లో స్థానిక అధికారులపై సీఎండీ జితేష్ వీ పాటిల్‌కు ఫిర్యాదులు వస్తున్నా బాధ్యులపై చర్యల విషయంలో జాప్యం జరుగుతున్నదంటూ ఉద్యోగులు చెవులు కొరుక్కుంటున్నారు. కీసర ఫోకల్‌గా డిమాండ్ ఉన్న పోస్టు కావడంతో విజిలెన్స్ విచారణ జరుగుతున్నట్లు సమాచారం. ఈ సమయంలోనే ఒక ఏఈ సెలవుపై వెళ్లిపోయారు. నాలుగు సెక్షన్లలోనూ ఆపరేషన్ ఏఈల బాధ్యతలు, అదనపు బాధ్యతలపై కూడా పెద్ద చర్చే జరుగుతోంది. దీంతో వేరే సెక్షన్ల వారికే అదనపు బాధ్యతలు అప్పగించడం వెనక మర్మమేంటని హబ్సిగూడ సర్కిల్లోని కొందరు సిబ్బంది మాట్లాడుకుంటున్నారు. మరి ఈ వ్యవహారంపై డిస్కం ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారంటూ మింట్కాంపౌండ్తో పాటు మేడ్చల్ జోన్లో సిబ్బంది చర్చించుకుంటున్నారు.