సిటీబ్యూరో, ఫిబ్రవరి 16 (నమస్తే తెలంగాణ): క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్‌తో మంచి లాభాలొస్తాయంటూ నమ్మిస్తూ సైబర్‌నేరగాళ్లు అందిన కాడికి దోచేస్తున్నారు. బిట్ కాయిన్ ధర లక్ష డాలర్లకు చేరువవుతుండగా, ఇతర క్రిప్టో కరెన్సీలలో రోజు వారిగా హెచ్చుతగ్గులుండడంతో చాలా మంది విద్యావంతులు స్టాక్స్ ఎక్స్ఛేంజ్ కంటే క్రిప్టోలో పెట్టుబడులు పెడితే లాభాలు ఆర్జించవచ్చనే ఆలోచనలో ఉంటున్నారు. అలాంటి వారినే లక్ష్యంగా చేసుకుంటూ సైబర్‌నేరగాళ్లు లక్షల రూపాయలు దోచేస్తున్నారు.
కేవలం రెండు రోజుల వ్యవధిలోనే రాచకొండ కమిషనరేట్ పరిధిలో రూ. కోటికిపైగా బాధితులు మోసపోయారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు, వ్యాపారులు ఇందులో బాధితులుగా మిగులుతున్నారు. క్రిప్టోలో ఎక్కువగా యూఎస్డీటీపై పెట్టుబడి పెట్టండంటూ సైబర్‌నేరగాళ్లు సూచనలు చేస్తున్నారు. మోసపోతున్న వాళ్లు చాల మంది ఇన్‌స్టాగ్రామ్స్ రిల్స్లలో వచ్చే ట్రేడింగ్ ప్రకటనలతో ఈజీగా బుట్టలో పడేస్తున్నారు.
సోషల్‌మీడియాలో సైబర్‌నేరగాళ్లు అర్టిఫిషియల్ ఇంటలిజెన్స్‌ను ఉపయోగిస్తూ ప్రముఖులు ట్రేడింగ్ చేసి భారీ లాభాలు సంపాదించారంటూ వారి డమ్మీ వీడియోలు తయారు చేసి ప్రకటనలు ఇస్తున్నారు. ఇలాంటి వాటికి కొందరు ప్రేరేపితమవుతుండగా, మరికొందరు ఇతర ప్రకటనలతో ట్రేడింగ్ ట్రాప్‌లో పడి భారీ మోసాలు చవిచూస్తున్నారు. సైబర్‌నేరగాళ్లు భారతదేశంలో మోసం ద్వారా బ్యాంకు ఖాతాలలో డిపాజిట్ చేయించే రూపాయాలను, యూఎస్డీటీ క్రిప్టోలోకి మార్చి విదేశాలకు పంపిస్తున్న ఘటనలు కూడా ఉన్నాయి. ఇలా సైబర్‌నేరగాళ్లు క్రిప్టోలో ట్రేడింగ్ అంటూ అమాయకులకు వల వేస్తూ బాధితులను భిన్న రకాలుగా మోసం చేస్తున్నారు. కొన్ని సందర్భాలలో బాధితులు సైతం నిందితులుగా మారే అవకాశాలున్నాయి.