Fire Accident |సికింద్రాబాద్.. రామ్‌గోపాల్‌పేటలోని డెక్కన్ స్టోర్స్‌లో చెలరేగిన మంటలు ఎంతకూ అదుపులోకి రావటం లేదు. సుమారు 25 ఫైరింజన్లతో 250 మంది ఫైర్ ఫైటర్స్, ఇతర డిజాస్టర్ మేనేజ్మెంట్ సిబ్బంది దాదాపు 5గంటలుగా శ్రమిస్తున్నా అగ్నికిలలు అదుపులోకి రావటం లేదు. బిల్డింగ్ మూడు వైపుల నుంచి గ్యాలన్లకొద్ది నీళ్లు, 100 టన్నులకు పైగా యాంటీఫైర్ ఫోమ్(పొగ)ను ప్రయోగించినా మంటలు అదుపులోకి రావడం లేదు. ఐదంతస్తుల బిల్డింగ్ పూర్తిగా దెబ్బతిని కూలిపోయే ప్రమాదం ఉందని ఫైర్ అధికారులు చెబుతున్నారు.
ముందు జాగ్రత్త చర్యగా అగ్రిప్రమాదం జరిగిన భవనానికి ఆనుకుని ఉన్న ఇతర బిల్డింగుల్లోని ప్రజలను ఖాళీ చేయించినట్లు అధికారులు తెలిపారు. ప్రమాదం జరిగిన స్పోర్ట్స్ షోరూంలో హైఫ్లేమబుల్ మెటీరియల్ ఉన్నందునే మంటలు చల్లారటం లేదని ఫైర్ సిబ్బింది చెబుతున్నారు. స్పోర్ట్స్ డ్రెస్‌లు తయారు చేసే నైలాన్, రెగ్జీన్ వంటి మెటీరియల్ బిల్డింగ్ లోపల అధిక మోతాదులో ఉన్నట్లు తెలుస్తున్నది. ఆ మెటీరియల్ అంతా పూర్తిగా కాలిపోయిన తర్వాతే మంటలు తగ్గుముఖం పట్టే అవకాశమున్నట్లు అధికారులు వెల్లడిస్తున్నారు.
హుస్సేన్ సాగర్‌కు సమీపంలోని రామ్‌గోపాల్ పేటలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన బిల్డింగ్‌కు సమీపంలోనే కిమ్స్ ఆస్పత్రి కూడా ఉంది. లక్డీకాపూల్, లిబర్టీ నుంచి ట్యాంక్మీదుగా సికింద్రాబాద్ వెళ్లే మార్గాన్ని పూర్తిగా నిలిపివేశారు. ప్యాట్నీ, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి వచ్చే మార్గాలను కూడా పూర్తిగా క్లోజ్ చేసినట్లు ట్రాఫిక్ అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు ఎలాంటి ప్రాణ నష్టం జరిగినట్లు సమాచారం లేదు. ఒకరిద్దరికి స్వల్పగాయాలయినట్లు తెలుస్తున్నది.
భవనంలో మరికొందరు చిక్కుకొని ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. మంటలు, తీవ్రమైన పొగ వల్ల సహాయక చర్యలకు విఘాతం కలుగుతున్నది. తీవ్రమైన పొగతో ఇద్దరు అగ్నిమాపక సిబ్బంది అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఇద్దరిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.