సిటీబ్యూరో, జూన్ 22(నమస్తే తెలంగాణ): ‘బాకీ ఉన్నామా.. వదిలేయ్. మనసారే ఉన్నాడు కదా.. కొత్త కనెక్షన్‌కు అప్లై చేయి. బాకీలో కొంత మొత్తం ఆయనకే సమర్పించుకుంటే కొత్త కనెక్షన్ వస్తుంది. పాత ముచ్చట వదిలేయండి’ అంటూ మేడ్చల్ జిల్లాలో ఒక సర్కిల్‌కు చెందిన ఓ పరిశ్రమ యజమాని తన అకౌంటెంట్‌కు చెప్పి తానుబాకీ ఉన్న రూ.82లక్షలకు బదులు అక్కడి సర్కిల్ ఉన్నతాధికారితో సహా ఆయన చెప్పిన సిబ్బందికి రూ.15 లక్షలు ఇచ్చి కొత్త కనెక్షన్ తీసుకున్నారు. ఇప్పుడు తీసుకున్న కొత్త కనెక్షన్లోనూ ఎక్కువ మొత్తంలోనే బాకీ పడ్డట్లు సమాచారం.
ఇలాంటి కనెక్షన్ల దందా ప్రధానంగా గ్రేటర్ శివార్లో ఎక్కువగా జరుగుతోంది. నెమలినగర్, గోపన్‌పల్లి, కోకాపేట, కోహెడ, తట్టిఅన్నారం, అబ్దుల్లాపూర్‌మెట్, మాన్సాన్పల్లి, అజిజ్నగర్, కందుకూరు, కే సింగారం, మల్లాపూర్, వాయుపురి, ఉప్పల్‌భగాయత్, దుండిగల్ వంటి ప్రాంతాల్లో ఉన్న హెచ్‌టీ కనెక్షన్లలో ఈ దందా జరుగుతున్నట్లు సమాచారం. ముఖ్యంగా ఈ ప్రాంతాల్లో కొత్తగా ఇండస్ట్రీస్ రావడం, హైరైజ్డ్ నిర్మాణాలు రావడంతో వాటికి సంబంధించి విద్యుత్ వినియోగం పెరుగుతోంది. గతంలో ఉన్న వాటికి భారీగా బిల్లులు పేరుకుపోవడంతో వాటి స్థానంలోనే కొత్త కనెక్షన్ తీసుకోవడానికి స్థానిక అధికారుల సలహాతో అక్రమంగా పేరు మార్చి కొత్త కనెక్షన్లు తీసుకుంటున్నారు.
గ్రేటర్ పరిధిలో సర్కిళ్ల వారీగా హెచ్‌టీ కనెక్షన్లు, వాటి నుంచి రావాల్సిన బిల్లులపై దక్షిణ డిస్కం ఆరా తీస్తోంది. ప్రధానంగా రాజేంద్రనగర్ సర్కిల్లో 99 కనెక్షన్ల నుంచి రూ. 123 కోట్లు, రంగారెడ్డి జోన్లో 167 కనెక్షన్ల నుంచి రూ.177 కోట్లు, శివారు జిల్లాల్లో 214 కనెక్షన్ల నుంచి రూ. 280 కోట్ల వరకు బిల్లులు వసూలు కావాలి. శివారు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున బాకీలు ఉన్నట్లు తేలడంతో వీటిని రాబట్టే దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టింది. ముఖ్యంగా ఉద్యేశపూర్వకంగా బిల్లులు ఎగ్గొట్టిన వినియోగదారులను గుర్తించి పేరుకుపోయిన బకాయిలను వసూలు చేయనున్నట్లు డిస్కం ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.
పరిశ్రమలు, బహుళ నిర్మాణాలకు సంబంధించి హెచ్‌టీ కనెక్షన్ల బకాయిలు తీర్చకుండా ఉన్నవారిపై డిస్కం వివరాలు సేకరిస్తున్నది. ఇదే సమయంలో ఉద్దేశపూర్వకంగా విద్యుత్ బిల్లులు ఎగ్గొట్టిన వినియోగదారులు, పేరుకుపోయిన మొండిబకాయిలను వసూలు చేయకుండా స్థానికంగా పనిచేస్తున్న అధికారులు, సిబ్బంది అక్రమంగా దందా చేసినట్లు ఎస్పీడీసీఎల్ అధికారులు నిర్ధారించారు. కనెక్షన్ క్యాన్సిల్ చేసిన పరిశ్రమకు లేదా నిర్మాణానికి మళ్లీ మరో పేరుతో కనెక్షన్లు జారీ చేసి అక్రమాలకు పాల్పడిన ఇంజినీర్లపై ఉన్నతాధికారులు దృష్టిపెట్టారు.
బిల్లు బకాయిపడిన సంస్థకు మరో పేరుతో కనెక్షన్ జారీ చేసిన ఇంజినీర్లను సుమారుగా 11 మందిని గుర్తించినట్లు సమాచారం. మరికొంత మంది వివరాలు కూడా సేకరిస్తున్నారని, వారిలో ఎవరెవరూ డిస్కం ప్రధానకార్యాలయ అధికారులతో కుమ్ముక్కయ్యారో కూడా ఆరా తీస్తున్నారు. అంతేకాకుండా ఒక్కో సెక్షన్లో ఈ తరహా కేసులు ఏడు నుంచి ఎనిమిది వరకు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ వ్యవహారంలో ఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ అలీ చాలా సీరియస్‌గా ఉన్నారు. సంస్థ ఆర్థిక సంక్షోభానికి కారణమైన ఇంజినీర్లపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.