సిటీబ్యూరో, ఫిబ్రవరి 7 (నమస్తే తెలంగాణ): జవహర్‌నగర్ డంపింగ్ యార్డు వల్ల ఏర్పడుతున్న కాలుష్య కారకులపై చర్యలు తీసుకోవాలని ఇచ్చిన సూచనలకు స్పందించకపోవడంపై పీసీబీ చైర్మన్, జీహెచ్ఎంసీ కమిషనర్‌పై మానవ హక్కుల కమిషన్ సీరియస్ అయ్యింది. డంపింగ్ యార్డు నుంచి వెలువడే కాలుష్యంతో ఎలాంటి ప్రభావం ఉన్నది.. ఎంత మంది ప్రభావితం అవుతున్నారు.. కాలుష్య నియంత్రణకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో నాలుగు వారాల్లోగా సమగ్ర నివేదిక ఇవ్వకుంటే తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. డంపింగ్ యార్డు వల్ల మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా పరిసర ప్రాంతాలన్ని కలుషితమవుతున్నాయని, 2025 నవంబర్ 6న ఉమేష్‌కుమార్ అనే వ్యక్తి మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు.
డంపింగ్ యార్డుతో విషపూరితమైన గాలి, దుర్వాసన వెదజల్లుతున్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. అదేవిధంగా డంపింగ్ యార్డు పరిసరాల్లో అనధికారికంగా విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని నిర్వహిస్తున్నారని, దాని వల్ల పరిసర ప్రాంతాల ప్రజలు తీవ్రంగా ప్రభావితం అవుతున్నారని తెలిపారు. అతడి ఫిర్యాదును పరిగణనలోకి తీసుకున్న హెచ్ఆర్సీ కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్, జీహెచ్ఎంసీ కమిషనర్ కాలుష్యాన్ని తగ్గించేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని, అదే నెల 24న సూచించింది. కానీ పీసీబీ చైర్మన్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఇప్పటిదాకా స్పందించలేదు. వారి తీరుపై హెచ్ఆర్సీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నాలుగు వారాల్లోగా తగిన చర్యలు తీసుకోకపోతే తీవ్రంగా పరిగణిస్తామని స్పష్టం చేసింది.