HMDA | సిటీబ్యూరో, జూలై 8(నమస్తే తెలంగాణ) : హైదరాబాద్‌కు తలమానికం కానున్న రెండు ఎలివేటెడ్ కారిడార్లను ఎలా నిర్మిద్దామనే విషయంలో హెచ్ఎండీఏ మల్లగుల్లాలు పడుతుంది. ప్రాజెక్టు ఖర్చు, నిర్మాణ వ్యయం, రెవెన్యూ వంటి విషయాల్లో మరింత లోతుగా తెలుసుకోవాలని భావిస్తోంది. ఇందుకు ప్రత్యేకంగా ట్రాన్సాక్షన్ అడ్వైజర్లను నియమించుకునేందుకు హెచ్ఎండీఏ కసరత్తు చేస్తోంది. జేబీఎస్ నుంచి శామీర్‌పేట్ వరకు, అదే విధంగా ప్యారడైజ్ నుంచి డెయిర్ ఫాం రోడ్డు వరకు నిర్మించనున్న రెండు ఎలివేటెడ్ కారిడార్లకు ఆర్థికంగా తుది రూపు తీసుకువచ్చేలా సలహాదారులను నియమించుకోనుంది. ఇప్పటికే టీఏల విషయంలో ప్రతిపాదనలను కూడా కార్యరూపంలోకి తీసుకువచ్చింది.
ఎలివేటెడ్ కారిడార్ల విషయంలో ప్రధానంగా ఆర్థిక పరమైన సాధ్యాసాధ్యాలను హెచ్ఎండీఏ విశ్లేషించేందుకు ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే ఈ ప్రాజెక్టు నమూనాలు సిద్ధం కావడంతో నిర్మాణానికి ప్రధానమైన ఆర్థిక వనరులు, వినియోగం, నిర్వహణ భారం వంటి రెవెన్యూ పరమైన అంశాలపై అంచనా వేసేందుకు ఈ టీఏలూ ఇచ్చే సలహాలను స్వీకరించనున్నారు. దీనికి ఆర్థిక వ్యవహారాల, మంత్రిత్వ శాఖతో పాటుగా ఎన్హెచ్ఏఐ గుర్తింపు పొందిన ట్రాన్సాక్షనల్ అడ్వైజరీ కన్సల్టెన్సీను ఆశ్రయించనుంది. ఈ ఏజెన్సీలు ప్రాజెక్టు ఒప్పంద వ్యవహారాలు, రెవెన్యూ సంబంధిత అంశాలను సమగ్రమైన అవగాహన వచ్చేలా అధ్యయనం చేయించనున్నారు. అదే విధంగా నిర్మాణానికి ముందు డెవలపర్ల విషయంలోనూ ఈ సంస్థ సలహాలు ఇవ్వనుంది. ఆయా కంపెనీల ఆర్థికమైన అంశాలను పరిగణనలోకి సూచనలు చేయనుంది. దీని ద్వారా వచ్చే కంపెనీల నుంచి ఉత్తమ కాంట్రాక్టర్‌ను పారదర్శకంగా ఎంపిక చేసుకునే వీలుంటుందని, పీపీపీ విధానంలో చేపట్టబోయే ప్రాజెక్టులో రెవెన్యూ పరంగా డిజైనింగ్ మార్పులను కూడా సిఫార్సు చేసే అవకాశం ఉంటుందని తెలిపింది. ఈ టీఏ సమర్థవంతమైన ప్రైవేటు సంస్థను ఎంపిక చేసుకునేందుకు సాయపడనుంది.
నిజానికి దాదాపు 16 కిలోమీటర్ల మేర రెండు ప్రధాన మార్గాల్లో నిర్మించనున్న ఎలివేటెడ్ కారిడార్ల విషయంలో డిజైన్లు ఇప్పటికే ఖరారైనప్పటికీ, కార్యరూపంలోకి తీసుకు వచ్చే విషయంలోనూ హెచ్ఎండీఏ మల్లగుల్లాలు పడుతోంది. ప్రధానంగా నిర్మాణ ఖర్చులు, నిర్వహణ భారంపై అవగాహన లేకపోతే ప్రాజెక్టు వ్యయంపై పూర్తి స్పష్టత లేకనే ప్రత్యామ్నాయంగా టీఏలను నియమించుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ప్యాట్నీ నుంచి తూంకుంట వరకు వెస్ట్ మారేడ్‌పల్లి, కార్ఖానా, తిరుమలగిరి, బొల్లారం, అల్వాల్, హకీంపేట్ మీదుగా తూంకుంట వరకు ఉండే 11 కిలోమీటర్ల ఎలివేటెడ్ కారిడార్‌ను సమగ్రంగా పరిశీలించనుంది.