కేపీహెచ్బీ కాలనీ, జూన్ 8: హైదరాబాద్ కేపీహెచ్బీ కాలనీలో వేలంపాటకు పెట్టిన స్థలాలను నిర్భయంగా కొనుగోలు చేయవచ్చని హౌసింగ్ బోర్డు వెస్ట్రన్ డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కె.కిరణ్ బాబు తెలిపారు. ఈ స్థలాలకు సంబంధించి ఎలాంటి అనుమానాలు ఉన్నా, నివృత్తి చేయడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో ‘ఆ ఫ్లాట్ కొంటే.. ఫ్లాట్ తప్పదా’ అనే శీర్షికతో శనివారం వచ్చిన కథనానికి ఆయన స్పందించారు. కేపీహెచ్బీ కాలనీ ఏడో ఫేజ్లో వేలానికి పెట్టిన ఫ్లాట్ నంబర్ 28, 29కి సంబంధించి పశ్చిమవైపు సరిహద్దును ఏర్పాటుచేసి ఇచ్చే బాధ్యత హౌసింగ్ బోర్డుదేనని ఆయన స్పష్టం చేశారు.
ఈ ఫ్లాట్లకు ఆనుకొని ఉన్న అంకుర వైద్యశాల, చర్చి, సాయి ఆయుష్ భవనం తో పాటు 7 భవనాలకు లేఅవుట్ ప్రకారం రోడ్డు సౌకర్యం పశ్చిమం వైపు ఉందని… తూర్పు వైపునకు వారికి ద్వారం లేదని తెలిపారు. వైన్ షాప్ పక్కన ఉన్న స్థలం విషయంలో రహదారి సమస్య ఉందని, ఈ స్థలం తో పాటు కాలనీ 9వ పేజ్ లోని ఖాళీ స్థలాలను మరో దఫా వేలంపాట నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. ప్లాట్ నెంబర్ 23 పక్కన.. మెహిఫిల్ హోటల్ భవనానికి పెట్టినటువంటి ఏసీ ఔటర్ ఫ్యాన్లను తొలగించడంతోపాటు సరిహద్దును నిర్ధారించి ఇచ్చే బాధ్యత హౌసింగ్ బోర్డు తీసుకుంటుందని తెలిపారు.
హౌసింగ్ బోర్డులో వేలంపాటకు పెట్టిన స్థలాల విషయంలో ఏమైనా అనుమానాలు ఉంటే సోమవారం నాడు కూకట్పల్లిలోని ముంబై జాతీయ రహదారి పక్కన ఉన్న హౌసింగ్ బోర్డు వెస్ట్రన్ డివిజన్ కార్యాలయంలో అధికారులను సంప్రదించాలని కోరారు. వేలానికి పెట్టిన ప్లాట్లు రాష్ట్ర హౌసింగ్ బోర్డు సంస్థ ద్వారా విక్రయించడం జరుగుతుందని… కొనుగోలుదారులకు భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుందని స్పష్టం చేశారు. ఆసక్తి గలవారు నిర్భయంగా వేలంపాటలో పాల్గొని… నచ్చిన స్థలాలను కొనుగోలు చేయవచ్చని తెలిపారు.