సిటీబ్యూరో, సెప్టెంబర్ 25 (నమస్తే తెలంగాణ): దేశంలోనే మొదటిసారిగా అన్ని ప్రభుత్వ విభాగాలను ఒకేచోటకు తీసుకొచ్చి.. రాష్ట్ర వ్యాప్తంగా సేవలందించేందుకు తెలంగాణ స్టేట్ పోలీస్ ఇంటిగ్రెటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్(టీఎస్‌పీఐసీసీసీ)ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్మించి సేవలు నిర్వహిస్తున్నదని, ఇది రాష్ర్టానికి గర్వకారణమని హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. బంజారాహిల్స్‌లోని కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లో మల్టీ ఏజెన్సీ ఆపరేషన్ సెంటర్‌కు 2306 సీసీ కెమెరాలను అనుసంధానం చేసే నెట్వర్క్ కెమెరాలను ఆయన ప్రారంభించారు. దీంతో పాటు విజిటర్స్ గ్యాలరీ, వార్ రూమ్‌లను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పడక ముందు శాంతి భద్రతల విషయంలో ఎన్నో అపోహలు ఉండేవన్నారు. వాటన్నింటిని పటాపంచలు చేస్తూ సీఎం కేసీఆర్ పటిష్టమైన శాంతి భద్రతల నిర్వహణలో రాష్ర్టాన్ని దేశంలోనే మొదటి స్థానానికి తీసికెళ్లారన్నారు.
సీఎం ఆలోచనతో వచ్చిందే కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ అని, అందులో అత్యాధునిక టెక్నాలజీతో కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌ను నిర్వహిస్తూ నేడు హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలోని సీసీ కెమెరాలను అనుసంధానం చేసుకుంటున్నామన్నారు. అన్ని ప్రభుత్వ శాఖలతో సమన్వయం చేసుకుంటూ విపత్తుల సమయంలో ఇక్కడి నుంచే సేవలందిస్తామని, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సీసీ కెమెరాల నెట్వర్క్ దీనికి అనుసంధానమవుతుందన్నారు. ఈ నెల 28వ తేదీన ఒకే రోజు వినాయక నిమజ్జనం, మిలాద్ ఉన్ నబీ ర్యాలీ రావడంతో, మిలాద్ ఉన్ నబీ ర్యాలీని వచ్చే నెల 1వ తేదీకి వాయిదా వేశారన్నారు. దేశంలోని మొత్తం సీసీ కెమెరాల్లో 64 శాతం మన తెలంగాణ రాష్ట్రంలోనే ఉన్నాయన్నారు. సీసీ కెమెరాల నెట్‌వర్క్‌ను అధునాతన కెమెరాలతో జోడిస్తూ వేగంగా సేవలందించేందుకు ప్రయత్నిస్తున్న నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ బృందాన్ని ఆయన అభినందించారు.
విదేశాల్లో పరిశీలించి..
డీజీపీ అంజనీకుమార్ మాట్లాడుతూ.. 2014-15లో కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ నిర్మాణం విషయంలో అంతర్గత సమావేశాలు జరిగాయని, ముఖ్యమంత్రి పలుమార్లు పోలీసు ఉన్నతాధికారులతో సమావేశమయ్యారని, ఇతర దేశాలలో పర్యటించి అక్కడి కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌ను పరిశీలించాలని సూచించినట్లు తెలిపారు. తాను న్యూయార్కు సిటీకి వెళ్లి వచ్చానన్నారు. ముందు చూపుతో కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌ను ఏర్పాటు చేశారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా టెక్నాలజీని ఇక్కడ అనుసంధానం చేస్తున్నామన్నారు. శాంతి భద్రతలు బాగున్నప్పుడే అభివృద్ధి ఉంటుందని గుర్తించిన సీఎం.. రాష్ట్రం ఏర్పడగానే శాంతి భద్రతలపై ఫోకస్ పెట్టారన్నారు. ఇప్పుడు హైదరాబాద్‌లో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దేశాల నుంచి పెట్టుబడులు వస్తున్నాయని, ప్రపంచంలోనే టాప్ 10లో ఉన్న కంపెనీలు ఇక్కడ తమ సంస్థలను ఏర్పాటు చేశాయన్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో నిరంతరం సేవలందిస్తున్న ప్రతి పోలీసుకు ఆయన అభినందనలు తెలిపారు.
అన్ని వ్యవస్థలు ఇక్కడి నుంచే..
హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ మాట్లాడుతూ.. గత ఏడాది సీసీసీని సీఎం ప్రారంభించారని, ఆ తరువాత బషీర్‌బాగ్ నుంచి హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్‌ను ఇక్కడకు మార్చామన్నారు. ఏ బ్లాక్ 18వ ఫ్లోర్లో సిటీ పోలీస్ కార్యాలయం ఉండగా, సిటీ పోలీస్ కమిషనరేట్ సిబ్బంది 800 మంది ఇక్కడి నుంచి పనిచేస్తున్నారన్నారు. బ్లాక్ బీలో రాష్ట్ర స్థాయి వ్యవస్థలు యాంటీ నార్కొటిక్ బ్యూరో, సైబర్ సెక్యూరిటీ బ్యూరోలు , ఇతర విభాగాలకు చెందిన కెమెరాలు, సెన్పార్ డేటా, డయల్ 100 కాల్ సెంటర్లు ఉన్నాయన్నారు. సీఎం ఆలోచనతో అన్ని ప్రభుత్వ శాఖలకు సంబంధించి బహుళ-ఏజెన్సీ కార్యకలాపాలు, విపత్తు నిర్వహణ కేంద్రం పూర్తిస్థాయిలో రూపుదిద్దుకుందన్నారు. ట్రై పోలీస్ కమిషనరేట్లకు సంబంధించి హైదరాబాద్ సేఫ్ అండ్ స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ 10 వేలు, కమ్యూనిటీ 10 వేలు, నేను సైతం 5 లక్షలు, సేఫ్ సిటీ ప్రాజెక్ట్ 3168 కెమెరాలు ఉన్నాయన్నారు. ఈ ఏడాది అన్ని ప్రభుత్వ శాఖలు గణేశ్ నిమజ్జనాన్ని మల్టీ ఏజెన్సీ ఆపరేషన్ సెంటర్ నుంచే పర్యవేక్షిస్తాయన్నారు. ఈ సమావేశంలో టెక్నాలజీ వినియోగంపై టెక్నికల్ ఎస్పీ పుష్ప, ట్రాఫిక్ టెక్నికల్ డీఎస్పీ నర్సింగ్‌రావు సమగ్రంగా వివరించారు. ఈ సమావేశంలో నగర అదనపు సీపీ విక్రమ్ సింగ్ మాన్, ట్రాఫిక్ అదనపు సీపీ సుధీర్‌బాబు, సేఫ్ సిటీ ప్రాజెక్ట్ నోడ్ అధికారి, నగర జాయింట్ సీపీ (క్రైమ్స్) గజారావు భూపాల్, జాయింట్ సీపీ విశ్వప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.