ఘట్కేసర్ రూరల్, నవంబర్ 27: ప్రత్యర్థులపై ఫిర్యాదు చేస్తే పట్టించుకోవడంలేదని ఓ హోంగార్డు హల్చల్ సృష్టించాడు. తనకు న్యాయం చేయడంలేదని ఆరోపిస్తూ ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. స్థానికంగా సంచలనం సృష్టించిన సంఘటన వివరాలిలా ఉన్నాయి. ఘట్కేసర్ పోలీస్‌స్టేషన్ ఏదులాబాద్ అనుబంధ గ్రామం కొత్తగూడెంకు చెందిన మహ్మద్ ఘనీ అహ్మద్ చర్లపల్లి పోలీస్‌స్టేషన్‌లో హోంగార్డుగా పని చేస్తున్నాడు.
కొత్తగూడెంలో తాతల నుంచి సంక్రమించిన 30 గుంటల భూమి ఘనీ అహ్మద్ కబ్జాలో ఉన్నది. రెండురోజుల కిందట చుట్టు గోడ నిర్మించేందుకు యత్నించగా.. సమీప బంధువులు అయిన అతడి పెదనాన్న అఫ్జల్, అతడి కొడుకు జబ్బార్ అడ్డుకుని గోడ కట్టవద్దని హెచ్చరించారు. తాను కబ్జాలో ఉంటున్న భూమిలో తాను గోడ కట్టుకుంటుండగా కొంత మంది అడ్డుకుంటున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని రెండురోజుల కిందట ఘట్కేసర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.
ఘట్కేసర్ ఇన్స్పెక్టర్ పరశురాం వారిని పిలిపించి ఘనీ అహ్మద్ కబ్జాలో ఉంటున్నందున కోర్టు ద్వారా ఉత్తర్వులు ఉంటే తప్ప మీరు వెళ్లడానికి వీల్లేదని చెప్పి పంపించాడు. బుధవారం ఉదయం మరల గోడ కట్టేందుకు యత్నించగా.. అడ్డుకోవడంతో న్యాయం జరగడంలేదని హోంగార్డు ఘనీ అహ్మద్ ఘట్కేసర్ పోలీస్‌స్టేషన్‌లోని ఇన్స్పెక్టర్ ఛాంబర్లోకి వెళ్లాడు. తన భూమికి గోడ నిర్మాణాన్ని అడ్డుకోవడంతోపాటు కబ్జాకు యత్నిస్తున్నట్లు ఫిర్యాదు చేసినా మీరు పట్టించుకోవడంలేదని ఆరోపిస్తూ వెంట తెచ్చుకున్న పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఆ బాటిల్ లాక్కున్నారు. తనకు న్యాయం చేయాలని, తనకు అడ్డుపడుతున్న వారిని అరెస్టు చేయాలని హల్చల్ చేశాడు. పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు.