Old City Metro | సిటీబ్యూరో, జూలై 18 (నమస్తే తెలంగాణ) : పాతనగరంలో మెట్రో నిర్మాణం పనులపై హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ (హెచ్ఎంఆర్ఎల్) క్షేత్ర స్థాయిలో కసరత్తు మొదలు పెట్టింది. నిర్మించాల్సిన మార్గం ఖరారు కావడంతో ఆ మార్గంలో నిర్మాణ పనులు సాఫీగా జరిగేందుకు వీలుగా రైట్ ఆఫ్ వేను ఇచ్చేందుకు అవసరమైన పనులను మెట్రో అధికారులు చేపట్టారు. మొదటి దశ మెట్రో ప్రాజెక్టులో భాగంగా కారిడార్-2 (జేబీఎస్-ఫలక్‌నుమా)ను 15 కి.మీ మేర నిర్మించాల్సి ఉండగా, పలు కారణాలతో ఈ మార్గాన్ని జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ వరకు మాత్రమే నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీ మెట్రో పనులు పూర్తి చేసి, మెట్రో రైళ్లను నడుపుతోంది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఈ మార్గంలో పెండింగ్‌లో ఉన్న 5.5 కి.మీ మార్గంలో వెంటనే నిర్మాణం పనులు చేపట్టాలని ఆదేశించడంతో ప్రభుత్వం పరంగా హెచ్ఎంఆర్ఎల్ అధికారులు క్షేత్ర స్థాయిలో పనులు చేపట్టారు.
ముఖ్యంగా ఎంజీబీఎస్ తర్వాత నుంచి సాలార్జంగ్ మ్యూజియం-దారుల్షిఫా ప్రధాన రహదారి నుంచి మెట్రో పిల్లర్లను నిర్మాణం చేపట్టాల్సి ఉంటుంది. ఇప్పటికే పలుమార్లు రోడ్డు మార్గంలో ఉన్న మతపరమైన, సున్నితమైన నిర్మాణాలను గుర్తించిన మెట్రో అధికారులు , వాటిని పరిరక్షిస్తూ మెట్రో పిల్లర్ల నిర్మాణం కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. మెట్రో మార్గాన్ని ప్రతిపాదించిన రోడ్డును 80 అడుగుల విస్తీర్ణం ఉండేలా నిర్ణయించగా, మెట్రో స్టేషన్లు నిర్మించే 5 ప్రాంతాల్లో రోడ్డు వెడల్పు 120 అడుగులు ఉండేలా విస్తరణ పనులు చేపట్టనున్నారు. ఇందుకోసం పట్టణ ప్రణాళిక (టౌన్‌ప్లానింగ్) విభాగం అధికారులు క్షేత్ర స్థాయిలో వెడల్పును ఖరారు చేసి, తొలగించాల్సిన ఆస్తులను గుర్తించారు. మొత్తం మార్గంలో 1000కి పైగా ఆస్తులను సేకరించాల్సి ఉంటుందని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ప్రకటించారు.
పాతబస్తీ మెట్రో నిర్మాణ పనులు చేపట్టే ఎల్ అండ్ టీ మెట్రో సంస్థకు రైట్ ఆఫ్ వేను నిర్ణయించిన తర్వాత భూసార పరీక్షలతో పాటు పిల్లర్ల కోసం పెద్ద ఎత్తున తవ్వకాలు చేపట్టాల్సి ఉంటుంది. ఇందుకోసం రోడ్డు 30-40 అడుగుల మేర రోడ్డు మార్గాన్ని బ్లాక్ చేసి పనులు చేపట్టాల్సి ఉంటుంది. దీంతో ఈ మార్గంలో వెళ్లే ట్రాఫిక్‌కు అంతరాయం కలగనుంది. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ చిక్కులు లేకుండా ఉండేందుకు, నిర్మాణం పనులకు ఆటంకం కలగకుండా ఉండేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను స్థానిక ట్రాఫిక్ పోలీసులతో కలిసి క్షేత్ర స్థాయిలో సర్వే చేయనున్నారు. చార్మినార్ నుంచి ఇంజన్‌బౌలి-ఫలక్‌నుమా వరకు ప్రధాన మార్గానికి అనుసంధానంగా ఉన్న రోడ్లను పరిశీలించనున్నారు.
ముఖ్యంగా దారుల్షిఫా, మిరాలంమండి, పురానీ హవేలీ మార్గం నుంచే వచ్చే వాహనాలు బీబీ బజార్ రోడ్డు, తలాబ్‌కట్ట రోడ్డు చౌరస్తా నుంచి చార్మినార్ వైపు కాకుండా, సుల్తాన్ షాషీ రోడ్డు మీదుగా హరిబౌలి వరకు మళ్లించేందుకు వీలుగా అవకాశం ఉందని మెట్రో అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. అదేవిధంగా హరిబౌలి నుంచి బేలా క్రాస్ రోడ్డు, సుధా థియేటర్, గౌలిపుర, లాల్‌దర్వాజ రోడ్డు మీదుగా కందికల్‌గేట్ వైపు వాహనాలను మళ్లించేందుకు అనుకూలంగా ఉందని గుర్తించారు. అదేవిధంగా న్యూ షంషీర్గంజ్ రోడ్డు, తాడ్‌బండ్ రోడ్డులను సైతం ప్రత్యామ్నాయ మార్గాలుగా మళ్లించేందుకు అవకాశం ఉందని అధికారులు గుర్తించారు. మెట్రో పనులు ప్రారంభించే నాటి కల్లా ఈ ప్రత్యామ్నాయ మార్గాలను సిద్ధం చేసేందుకు అవసరమైన ఏర్పాట్లను జీహెచ్ఎంసీ, ట్రాఫిక్ పోలీసులతో కలిసి పనిచేస్తామని మెట్రో అధికారులు తెలిపారు.