సిటీబ్యూరో, డిసెంబర్ 1(నమస్తే తెలంగాణ) : 150 కిలోమీటర్ల పొడవు.. 19 ఇంటర్ ఛేంజ్లూ, విశాలమైన 8 లేన్లతో నగరానికి మణిహారంలా ఉన్న ఔటర్ రింగు రోడ్డు హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ ప్రధాన ఆదాయ వనరుగా ఉంది. ఇక ఔటర్‌కు ఇరువైపులా ఉండే ఒక కిలోమీటర్ పరిధిలో విస్తరించి ఉన్న గ్రోత్ కారిడార్ నిర్మాణ రంగానికి ముఖ్య కేంద్రంగా నిలుస్తుంది. గడిచిన ఆరేళ్లలో ఔటర్ సమీపంలో ఉన్న గ్రోత్ కారిడార్ ప్రాంతంలోనే ఆకాశ హర్మ్యాలు, అందమైన విల్లా ప్రాజెక్టులు, వరల్డ్ క్లాస్ కార్యాలయాలు కార్యకలాపాలను నిర్వహించాయి.
అయితే వీటి నిర్మాణ అనుమతులన్ని కూడా గ్రోత్ కారిడార్ విస్తరించి ఉన్న హెచ్ఎండీఏ పర్యవేక్షించింది. కానీ ఇకపై ఈ ప్రాంతం మొత్తం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్యాలయం పరిధిలోకి రానుంది. కాంగ్రెస్ సర్కారు జీహెచ్ఎంసీ పరిధిని ఔటర్ వరకు విస్తరించి, సమీపంలో ఉన్న మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లను విలీనం చేయనుంది. దీంతో పెరగనున్న జీహెచ్ఎంసీ పరిధికి అనుగుణంగా నగరం హద్దులు ఔటర్ లోపల ఉన్న గ్రోత్ కారిడార్‌ను కూడా విలీనం చేసుకోనుంది. 150 కిలోమీటర్లు విస్తరించి ఔటర్ రింగు రోడ్డు హెచ్ఎండీఏకు ప్రధాన ఆదాయ వనరుగా ఉంది.
ఔటర్ టోల్ ప్లాజాతోపాటు, గ్రోత్ కారిడార్ పరిధిలో ఉన్న కోకాపేట్ నియోపోలిస్, ఇతర లే అవుట్లు, అర్బన్ పార్కులన్నీ కూడా ఈ హెచ్ఎండీఏకు రెవెన్యూ తీసుకువచ్చేవి. కానీ బల్దియా పరిధి పెరగడంతో.. ఇక ఈ పరిధిలో ఉన్న భూముల్లో జరిగే నిర్మాణ కార్యకలాపాలు జీహెచ్ఎంసీ పరిధిలోకి రానున్నాయి. దీంతో ఇక్కడ నిర్వహించే రియల్ లావాదేవీలతో వచ్చే ఆదాయం కూడా బల్దియాకు వెళ్లిపోనుంది. ప్రస్తుతం హెచ్ఎండీఏ ట్రిపులార్ వరకు విస్తరించి ఉన్నా.. ఔటర్ లోపలి వరకు మాత్రమే భవన నిర్మాణ అనుమతులత్లో 60-80శాతం ఆదాయం సమకూరుతుంది. మిగిలినది మాత్రమే ఔటర్ దాటి వస్తుండగా.. ఇక ఈ ఆదాయం మొత్తం కూడా హెచ్ఎండీఏ నుంచి బల్దియా ఖజానాలోకి చేరనుంది.
ఆదాయంపై ప్రభావం..
హెచ్ఎండీఏకు ప్రధాన ఆదాయంగా మల్టీ స్టోర్ బిల్డింగ్ ఉంది. దీనిలోనే ఎక్కువ హైరైజ్ ప్రాజెక్టులు, లగ్జరీ రెసిడెన్షియల్ కమ్యూనిటీలు, వరల్డ్ క్లాస్ కమర్షియల్ స్పేస్‌లకు అనుమతులిస్తారు. వీటి ద్వారా హెచ్ఎండీఏకు అనుమతుల రూపంలో కోట్లాది రూపాయాల ఆదాయం సమకూరుతుంది. నిబంధన విషయంలో కూడా హెచ్ఎండీఏ, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపాలిటీకి వ్యత్యాసం ఉండగా.. ఇకపై వచ్చే భవనాలను జీహెచ్ఎంసీ అనుమతులతో నిర్మించాల్సి ఉంటుంది. అయితే ఏకీకృత భవన నిర్మాణ అనుమతులు అందుబాటులోకి వస్తున్నాయి.
కానీ ఆదాయం మాత్రం ఇకపై హెచ్ఎండీఏ కోల్పోనుంది. అదే గనుక జరిగితే ఔటర్ రింగు రోడ్డు అవతల విస్తరించి ఉండే ప్రాంతాల్లో జరిగే రియల్ ఎస్టేట్ లావాదేవీలతో వచ్చే ఆదాయంతోనే హెచ్ఎండీఏ సరిపెట్టుకోవాల్సి వస్తోంది. ఇప్పటికే హెచ్ఎండీఏ పరిధిలో రియల్ ఎస్టేట్ యాక్టివిటీ తగ్గిపోవడంతో.. ఆదాయం సగానికి పైగా పడిపోగా.. కీలకమైన గ్రోత్ కారిడార్ పరిధి మారడంతో మరింత ఆదాయం తగ్గిపోతుందనీ హెచ్ఎండీఏ అధికారులు చెబుతున్నారు.
గ్రోత్ కారిడార్‌లో వేల కోట్ల పెట్టుబడి..
ఔటర్ రింగు రోడ్డు అందుబాటులోకి వచ్చిన తర్వాత గ్రోత్ కారిడార్‌లో వేల కోట్ల రూపాయలను హెచ్ఎండీఏ ఖర్చు చేసింది. ఈ క్రమంలో విశాలమైన రోడ్లు, మౌలిక వసతుల కోసం ప్రత్యేక దృష్టి పెట్టి, పెరుగుతున్న పట్టణీకరణకు అనుగుణంగా సౌకర్యాలను కల్పించింది. ఈ క్రమంలో ఇప్పటివరకు ఖర్చు చేసిన మొత్తంలో రియల్ ఎస్టేట్‌కు అనుకూలమైన ప్రాంతంగా గ్రోత్ కారిడార్ ఎదిగింది. ఈ క్రమంలో విలీనం తర్వాత ఔటర్ లోపల ఉండే ఒక కిలోమీటర్ పరిధిలో జరిగే రియల్ కార్యకలాపాలతో వచ్చే ఆదాయం మాత్రం హెచ్ఎండీఏకు చేరనుంది. దీంతో భవిష్యత్తులో ఔటర్ నుంచి ట్రిపులార్ మధ్య జరిగే అభివృద్ధికి హెచ్ఎండీఏ మరోసారి సొంతంగా నిధులు సమకూర్చుకోవాల్సి ఉంటుంది. ఇలా హెచ్ఎండీఏ ఆదాయంపై గ్రేటర్ విలీన ప్రక్రియ తీవ్రమైన ప్రభావం చూపుతుందని అధికారులు పేర్కొన్నారు.