సిటీబ్యూరో, ఆగస్టు 13(నమస్తే తెలంగాణ): కొత్వాల్‌గూడ ఎకో పార్క్ నిర్మాణం డెయిలీ సీరియల్ తరహాలో కొనసాగుతూనే ఉంది. ఎప్పుడో అందుబాటులోకి రావాల్సిన ఈ ప్రాజెక్టు నిర్ణీత గడువు ముగిసినప్పటికీ పనులు సాగుతూనే ఉన్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఈ ప్రాజెక్టు పనులు నిలిచిపోగా.. ఎప్పుడు పూర్తవుతాయో తెలియని పరిస్థితి. హైదరాబాద్ పర్యాటక రంగానికి అంతర్జాతీయ శోభను తీసుకువచ్చే క్రమంలో బీఆర్ఎస్ హయాంలో కొత్వాల్‌గూడ ఎకో పార్క్ నిర్మాణ పనులను ప్రారంభించారు. రెండేళ్ల కాలంలో దాదాపు 90శాతం మేర పనులు పూర్తిచేయగా.. తదనంతరం అసెంబ్లీ ఎన్నికలు రావడం, రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో ఎకో పార్క్ నిర్మాణ పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. అయితే పెండింగ్‌లో ఉన్న పనులకు టెండర్లు ఖరారు చేస్తూ కాంగ్రెస్ సర్కార్ ఏడాది కాలంగా సాగదీస్తూనే ఉన్నారు. పనులలో ఎలాంటి పురోగతి లేదు.
గండిపేట వద్ద దాదాపు 100 ఎకరాల విస్తీర్ణంలో ఎకో పార్క్‌ను మూడేళ్ల కిందట హెచ్ఎండీఏ చేపట్టింది. పార్క్‌తోపాటు వరల్డ్ క్లాస్ టూరిజం అనుభూతిని కలిగించేలా అక్వేరియం, పక్షి శాలతోపాటు, జంట జలాశయాలను చూసేందుకు వీలుగా లోకేషన్ స్పాట్లను కూడా డెవలప్ చేసింది. కానీ ప్రస్తుత ప్రభుత్వ పెద్దల అలసత్వంతో పనులు నత్తనడనక సాగడంతో ఇప్పటికీ ప్రారంభోత్సవానికి నోచుకోవడం లేదు. ఓపెన్ ఎయిర్ థియేటర్, ఎంట్రెన్స్ ఆర్చ్, ఓపెన్ ప్లాజా, అప్రోచ్ రోడ్డు, ల్యాండ్ స్కేపింగ్, గ్రీనరీ సౌకర్యాలతోపాటు 8వేలకు పైగా విదేశీ పక్షులతో అద్భుతమైన పక్షి కేంద్రాన్ని కలిగి ఉంది. సందర్శకులు కూర్చునేందుకు వీలుగా కుర్చీలు, బల్లలను బిగించారు. కోటిన్నర అంచనా వ్యయంతో పార్కు పరిధిలో పనులకు హెచ్ఎండీఏ ఏర్పాట్లు చేసింది. కానీ గడిచిన ఆరు నెలలుగా ఇక్కడ పనులు నత్తనడకన సాగుతున్నాయి.
కొత్వాల్ గూడ ఎకో పార్కులో పెండింగ్ పనులను పూర్తి చేసేందుకు మరో 20 రోజులు పట్టే అవకాశం ఉండగా… సెప్టెంబర్ నెలాఖరులోగా ప్రారంభిస్తామని హెచ్ఎండీఏ వర్గాలు పేర్కొన్నాయి. భారీ ఎంట్రెన్స్ నిర్మాణంలో కొంత జాప్యం జరిగినట్లుగా అధికారులు వివరించారు. అధునాతన టూరిజం వసతులను కల్పించాలనే లక్ష్యంతో చేపట్టిన ఈ ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే… విదేశీ టూరిస్టులను విశేషంగా ఆకట్టుకుంటుంది. మహానగర జంట జలాశయాలకు సమీపంలో ఉండటంతో ఇదొక వీకెండ్ ఫ్యామిలీ ఎకో టూరిజం స్పాట్‌గా మారనుంది.