HMDA | సిటీబ్యూరో: హైదరాబాద్ నగరంలో హాట్ కేకుల్లా అమ్ముడుపోయిన భూములకు ఇప్పుడు డిమాండ్ లేకుండా పోయింది. అన్ని సౌలతులతో డెవలప్ చేసిన ప్లాట్లను కూడా విక్రయించలేకపోతుంది. దీనికి మార్కెట్లో నెలకొని ఉన్న సందిగ్ధ పరిస్థితులే కారణం. తాజాగా హైదరాబాద్ కేంద్రంగా ప్రైమ్ ఏరియాల్లో భూములను వేలం చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నది. టీజీఐఐసీ ద్వారా 400 ఎకరాల భూములను వేలం వేయాలనే ప్రతిపాదనలు తెరమీదకు వచ్చాయి.
400 ఎకరాల విస్తీర్ణంలో..
గచ్చిబౌలి కంచలో 400 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న టీజీఐఐసీ భూములను విక్రయంతో భూముల వేలంపై మరోసారి చర్చ మొదలైంది. ఖజానా నింపుకొనేందుకు కాంగ్రెస్ సర్కారు భూములను విక్రయించి సొమ్ము చేసుకోవాలని చూస్తోంది. ఈ క్రమంలోనే రేవంత్ సర్కార్ వేలానికి కసరత్తు ప్రారంభించడంతో హెచ్ఎండీఏ పరిధిలో కొంత కాలంగా పెండింగ్లో ఉన్న భూముల వేలం ప్రక్రియలో మళ్లీ కదలిక వచ్చింది.
చిగురించిన ఆశలు…
బంజారాహిల్స్, బుద్వేల్, వంటి కీలకమైన ప్రాంతాల్లోని వెంచర్లను వేలానికి సిద్ధం చేస్తున్నారు. కానీ మార్కెట్ దారుణంగా ఉండటంతో వేలానికి హెచ్ఎండీఏ ముందుకు రావడం లేదు. అసలే మార్కెట్లో ఉన్న ప్రతికూలతలను దృష్టిలో పెట్టుకుని, ఆచితూచి అడుగులు వేస్తుండగా… టీజీఐఐసీ భూముల వేలంతో హెచ్ఎండీఏకు ఆశలు చిగురించాయి. గతంలో హెచ్ఎండీఏకే భారీ ఆదాయం సమకూరిన నేపథ్యంలో… ప్రస్తుత మార్కెట్ పరిస్థితి ప్రకారం ఆ స్థాయిలో రెవెన్యూ రాకపోయినా కనీసం రూ. 3వేల కోట్లు వచ్చినా… హెచ్ఎండీఏ చేపట్టనున్న ప్రాజెక్టులకు భూసేకరణకు సరిపోతుందనే అంచనాలున్నాయి. ఇదిలా ఉంటే టీజీఐఐసీ ద్వారా నిర్వహించే భూముల వేలం ద్వారా ప్రభుత్వం రూ.25 నుంచి 30 వేల కోట్ల నిధులు సమకూర్చుకోవాలనే అంచనాతో ఉంది. ప్రభుత్వం వేలంపై వచ్చే రెవెన్యూపై పెట్టుకున్న ఆశలతో… హైదరాబాద్ కేంద్రంగా రియల్ ఎస్టేట్ స్వరూపం తేలిపోనున్నది.