HMDA | సిటీబ్యూరో, నవంబర్ 4(నమస్తే తెలంగాణ): చెరువుల హద్దుల నిర్ధారణకు హైకోర్టును మరికొంత సమయం కోరాలని హెచ్ఎండీఏ భావిస్తోంది. ఈ అంశం పై నవంబర్ రెండో వారంలో హైకోర్టు విచారణ చేపట్టనుండగా.. ఇప్పటికీ హెచ్ఎండీఏ పరిధిలో చెరువుల బఫర్, ఎఫ్టీఎల్ నిర్ధారణ పూర్తి కాకపోవడంతో మరికొంత గడువు కోరేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. హెచ్ఎండీఏ పరిధిలో చెరువుల ఎఫ్టీఎల్, బఫర్ జోన్ నిర్ధారణ సాగుతూనే ఉంది. హైకోర్టు ఆదేశించేంత వరకు చోద్యం చూసిన యంత్రాంగం..
ఇప్పుడు హడావిడిగా పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్న క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. ఈ క్రమంలో ఏడు జిల్లాల్లో విస్తరించిన హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో ఉన్న చెరువుల హద్దుల నిర్ధారణ పై రూపొందించాల్సిన నివేదిక మరింత జాప్యమయ్యేలా ఉంది. కనీసం బఫర్, ఎఫ్టీఎల్ జోన్ ప్రాంతాన్ని నిర్ధారణ పూర్తి చేయలేకపోయారు. చెరువు భూములన్నీ కబ్జాదారుల చేతుల్లోకి వెళ్లగా, హెచ్ఎండీఏ పరిధిలో చెరువుల అన్యాక్రాంతం పై ఎఫ్టీఎల్, బఫర్ జోన్ నిర్ధారణపై నివేదిక ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. దీంతో చెరువుల ఎఫ్టీఎల్, బఫర్ జోన్లను నవంబర్‌లోగా ఖరారు చేయాల్సి ఉండగా.. ఇప్పటికీ ఈ అంశంలో ఎలాంటి పురోగతి లేదు.
సమయం కోరేందుకు సిద్ధమైన యంత్రాంగం..
హెచ్ఎండీఏలో 3532కి పైగా చెరువులు ఉన్నాయి. హద్దుల నిర్ధారణ, పర్యవేక్షణ, నిర్వహణ, పరిరక్షణ, ఆధునీకరణ కార్యకలాపాల్లో భాగంగా ఇప్పటివరకు 2525 చెరువులకు మాత్రమే ప్రాథమికంగా హద్దులను ఖరారు చేసింది. ఇందులో 230 చెరువులకు మాత్రమే పూర్తి స్థాయి బఫర్ జోన్, ఎఫ్టీఎల్ నిర్ధారించారు. మిగిలిన 1000 చెరువులకు హద్దుల నిర్ధారణలో కనీసం బఫర్ జోన్ల గుర్తింపు కూడా పూర్తి కాలేదు. కనీసం చెరువులు, ఎఫ్టీఎల్, బఫర్ జోన్లో ఉన్న ఆక్రమణలపై నివేదిక రూపొందించలేదు. ఈ క్రమంలో నిర్ణీత గడువులోగా పూర్తి చేసే వీలు లేకపోవడంతో.. మరి కొంత సమయం తర్వాత సమగ్రమైన నివేదికను హైకోర్టుకు అందించే యోచనలో హెచ్ఎండీఏ యంత్రాంగం ఉంది. ఈ క్రమంలో అదనంగా మరికొంత సమయం తీసుకుని, నివేదిక రూపొందించనున్నట్లు సమాచారం. నవంబర్ రెండో వారంలో జరిగే విచారణలో హైకోర్టు స్పందన ఏ విధంగా ఉంటుందని అధికారులు మల్లాగుల్లాలు పడుతున్నారు.