సిటీబ్యూరో: హెచ్ఎండీఏలో శాశ్వత ఉద్యోగాల భర్తీకి మంగళం పాడారు. నచ్చితే డిప్యూటేషన్ లేదా, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను భర్తీ చేసుకోవడానికే ప్రాధాన్యతనిస్తున్నారు. ఏడు జిల్లాల నుంచి 11 జిల్లాలకు పెరిగినా.. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులతో విధులు నిర్వర్తించేందుకు హెచ్ఎండీఏ యంత్రాంగం సిద్ధమైంది. దీంతో మొత్తం 302 మంది ఉద్యోగులను భర్తీ చేసుకునేందుకు ఏర్పాట్లు చేస్తోంది.
ఇప్పటికే టెండర్లను ఆహ్వానించగా ఈ నెలాఖరులోపు ప్రక్రియ ముగియనుంది. 7 జిల్లాల నుంచి 11 జిల్లాలకు విస్తరించిన హెచ్ఎండీఏలో శాశ్వత ఉద్యోగుల కొరత పట్టిపీడిస్తున్నది. కానీ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులతో నెట్టుకొస్తున్నది. ఉన్నతాధికారులు కూడా శాశ్వత ఉద్యోగులను నియమించడం కంటే తాత్కాలిక విధానంలో పనులు చేసే సిబ్బంది నియామకానికి ప్రాధాన్యతనివ్వడంతో గడిచిన కొంతకాలంగా హెచ్ఎండీఏ పరిధిలో ఉద్యోగాల భర్తీ ఊసే లేకుండా పోయింది.
దీంతో ఇప్పటికే 40 శాతం సిబ్బంది కొరత ఉండగా, ఉన్న ఉద్యోగుల్లోనూ ప్రతి నెలా పదవీ విరమణ పొందుతుండటంతో ప్రధాన విభాగాలన్నీ తాత్కాలిక ఉద్యోగులతో నిండిపోతున్నాయి. తాజాగా 302 మంది అవుట్ సోర్సింగ్ సిబ్బందిని భర్తీ చేసుకునేందుకు హెచ్ఎండీఏ చర్యలు చేపట్టిన నేపథ్యంలో… శాశ్వత ఉద్యోగాల భర్తీ ఇప్పుడు ఇక లేనట్లేనని చర్చ నడుస్తోంది.