HMDA | సిటీబ్యూరో, ఏప్రిల్ 1(నమస్తే తెలంగాణ): ప్రాజెక్టుల కోసం నిధుల సేకరించాలని భావించిన హెచ్ఎండీఏ వెనకడుగు వేస్తోంది. పెండింగ్, కొత్త ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు రూ.20వేల కోట్ల ఫూలింగ్ చేసేందుకు ఏజెన్సీలను నియమించుకున్నది. కానీ నిధుల కోసం జరుగుతున్న వివాదాలు, ప్రభుత్వంపై వస్తున్న వ్యతిరేకత వంటి అంశాలతో పునరాలోచనలో పడింది. దీంతో ఆ జోలికి వెళ్లకపోవడమే మంచిదనే అభిప్రాయంతో ఉన్నతాధికారులు ఉన్నారు. గతంలో ఉన్న భూములను వేలం వేయాలని భావించినా.. రియల్ ఎస్టేట్ మార్కెట్ అధ్వాన్నంగా ఉండటంతో విరమించుకున్నట్టు తెలిసింది. తాజాగా ఇదే జరగనుండటంతో ప్రభుత్వం అయినా నిధులివ్వాలి.
హెచ్ఎండీఏ రెవెన్యూ అయినా పెరిగితే గానీ ప్రాజెక్టులు చేపట్టేందుకు అవసరమైన ఫండ్ సర్దుబాటు చేసుకునే వీల్లేకుండా పోయింది. 11 జిల్లాలకు విస్తరించిన హెచ్ఎండీఏకు గత పదేళ్లలో నిధుల సమీకరణ, ఆర్థిక వనరులను సమకూర్చుకున్నది. ఏనాడూ అప్పులు చేసి కొత్త ప్రాజెక్టులు చేపట్టింది లేదు. కానీ ఏడాదిగా పరిస్థితులన్నీ తారుమారైయ్యాయి. రెవెన్యూ తగ్గిపోవడం, రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించకపోవడంతో చేపట్టిన, ప్రతిపాదిత ప్రాజెక్టులను పూర్తి చేయలేకపోతుంది. ఇందుకు ఓ ఆర్థిక సంస్థను నియమించుకుని, హెచ్ఎండీఏ ఆస్తులను తనాఖా పెట్టాలని భావించింది. ఇందులో భాగంగా ఏకంగా రూ.20వేల కోట్లు సమీకరించాలని ప్రణాళికలు రూపొందించింది.
ఇటీవల భవన నిర్మాణ అనుమతుల ద్వారా వచ్చే ఆదాయం తగ్గిపోయింది. దీంతో అధిక మొత్తం నిధుల సర్దుబాటు చేసుకోవాలని భావించింది. ప్లానింగ్ విభాగం సేకరించే నిధులకు అదనంగా భూముల వేలం, డెవలప్మెంటల్ యాక్టివిటీతో హెచ్ఎండీఏ ఖజానా నిండుకునేది. కానీ పరిస్థితి తలకిందులైంది. ఆదాయం ఏకంగా 50శాతానికి పడిపోయింది. దీతో నిర్వహణ, జీతభత్యాలు మినహా కొత్త ప్రాజెక్టులు చేపట్టలేని పరిస్థితి నెలకొంది. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రతిపాదిత ప్రాజెక్టులను కూడా పూర్తి చేయలేని పరిస్థితి ఉంది.
హైదరాబాద్ కేంద్రంగా పెట్టుబడులు పెరిగితే గానీ అదనపు ఆదాయం సమకూరే పరిస్థితి లేదు. పెట్టుబడులను ఆకర్షించే వీల్లేకపోవడంతో.. నిధుల కోసం దిక్కులు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. రెండు ఎలివేటెడ్ కారిడార్ పనులు ఇప్పటికీ పట్టాలెక్కలేదు. ఓఆర్ఆర్ నుంచి ఆర్ఆర్ఆర్ అనుసంధానం చేసేలా కొత్తగా ప్రతిపాదించిన లింకు రోడ్ల నిర్మాణం, ఓఆర్ఆర్ లోపల రోడ్ల నిర్మాణం వంటి ప్రాజెక్టులు అదనపు భారంగా మారేలా ఉన్నాయి.
ఏడాదిన్నర గడిచిన మార్కెట్ కోలుకోకపోవడంతో… నిధుల సమీకరణపై హెచ్ఎండీఏ పునరాలోచనకు కారణమైంది. ప్రస్తుత ప్రతిపాదిత ప్రాజెక్టులను చేపట్టడానికి కనీసం రూ.15-20వేల కోట్లు ఖర్చు అవుతుందనే అంచనాలు ఉన్నాయి. వీటి కోసం ఆస్తులను తనాఖా పెట్టడం, లేదా భూముల వేలం నిర్వహణ కోసం ఏజెన్సీ నియామాకం జరిగినా… క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న ఇబ్బందులు, మార్కెట్ ప్రతికూలతలతో ఆశించిన మొత్తంలో నిధుల సమీకరణ సాధ్యం కాదనే అంచనాలు ఉన్నాయి.