Hyderabad | సిటీబ్యూరో, జూన్ 13 (నమస్తే తెలంగాణ): దేశంలో సరుకు రవాణా రంగం గణనీయమైన వృద్ధి రేటును నమోదు చేస్తోంది. ఐటీ కార్యాలయాలతో పాటు ఈ కామర్స్, రిటైల్ సంస్థలకు పెద్ద మొత్తంలో స్థలం అవసరం ఏర్పడుతోంది. ఇందుకోసం నగరం లోపల కాకుండా శివారు ప్రాంతాలే అనుకూలంగా మారాయి. దీంతో హెచ్ఎండీఏ లాజిస్టిక్ రంగానికి సంబంధించిన ప్రత్యేకంగా కార్యాచరణ రూపొందించి అమలు చేస్తున్నది. ఉత్తర,దక్షిణ భారత మెట్రో నగరాలకు మధ్యలో ఉన్న హైదరాబాద్‌కు సరుకు రవాణా పరంగా కీలకంగా కానుంది. హైదరాబాద్‌లో పారిశ్రామిక కార్యకలాపాలకు మద్దతు ఇవ్వడానికి హెచ్ఎండీఏ పరిధిలోని పలు ప్రాంతాల్లో మెరుగైన మౌలిక వసతులతో లాజిస్టిక్ పార్కులను ఏర్పాటు చేస్తున్నది. ఇప్పటికే విజయవాడ జాతీయ రహదారిపై బాటసింగారం వద్ద, నాగార్జున సాగర్ హైవేపై మంగల్‌పల్లి వద్ద హెచ్ఎండీఏ లాజిస్టిక్ పార్కులు నిర్వహణలో ఉండగా, ఇటీవల ముంబై జాతీయ రహదారిపై పటాన్చెరు, లక్డారం ప్రాంతాల్లోనూ కొత్తగా లాజిస్టిక్ పార్కుల అభివృద్ధి పనులు చేపట్టింది. తాజాగా శంషాబాద్‌లోనూ సుమారు 100 ఎకరాల స్థలాన్ని ట్రక్ పార్కుగా అందుబాటులోకి తీసుకువచ్చేందుకు హెచ్ఎండీఏ చర్యలు చేపట్టింది.
రాష్ట్ర ప్రభుత్వ ప్రగతిశీల చర్యల వల్ల తెలంగాణలో ఏవియేషన్, ఏరోస్పేస్ పరిశ్రమ వేగంగా అభివృద్ధి చెందుతోంది. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఎయిర్ ట్రాఫిక్ గణనీయంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో శంషాబాద్‌లోని 100 ఎకరాల స్థలాన్ని సమర్థవంతంగా వినియోగించుకునేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని హెచ్ఎండీఏ అధికారులు తెలిపారు. ట్రక్ పార్కింగ్‌లతో పాటు ఇతర కార్యకలాపాలు సమర్థవంతంగా నిర్వహించేందుకు వీలుగా ప్రైవేటు సంస్థలతో అధ్యయనం చేసిన తర్వాత మంగల్‌పల్లి, బాట సింగారం తరహాలోనే పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్షిప్ విధానంలో లాజిస్టిక్ పార్కుగా అభివృద్ధి చేసే ఆలోచన ఉందని అధికారులు తెలిపారు.
సరుకు రవాణా పరంగా శంషాబాద్‌లోని ట్రక్ పార్కింగ్ ఎంతో అనుకూలమైన ప్రాంతంలో ఉంది. ఔటర్ రింగు రోడ్డు లోపల హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారి ఒకవైపు, మరోవైపు ఓఆర్ఆర్ ఉండటంతో ఈ స్థలాన్ని పూర్తి స్థాయిలో లాజిస్టిక్ కార్యకలాపాలకు అనుకూలంగా తీర్చిదిద్దనున్నారు. సుమారు రూ.82.14 లక్షల వ్యయంతో ప్రాథమికంగా స్థలం చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసేందుకు ఇటీవల హెచ్ఎండీఏ టెండర్లు పిలిచింది. టెండరు గడువును ఈనెల 14 వరకు నిర్ణయించారు. బిడ్లు దాఖలు చేసిన సంస్థలకు చెందిన టెక్నికల్, ప్రైస్ బిడ్లను పరిశీలించి అభివృద్ధి పనులను చేపట్టనున్నారు.