సిటీబ్యూరో, జూలై 20 (నమస్తే తెలంగాణ) : కోకాపేట్‌లోని నియోపోలిస్ వేదికగా అంతర్జాతీయ నిర్మాణాలను చేపట్టేందుకు పుష్కలంగా అవకాశాలు ఉన్నాయని ఎంఏయూడీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అర్వింద్ కుమార్ అన్నారు. గురువారం కోకాపేట్ నియోపోలిస్ రెండో దశ ఈ వేలం ప్రీ బిడ్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రియల్టర్లు, బిల్డర్లు భారీ సంఖ్యలో హాజరు కాగా, ప్రాజెక్టు ఫీచర్లను వివరించారు. రూ.450 కోట్ల వ్యయంతో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కోకాపేట్ నియోపోలిస్ డెవలప్ చేసినట్లు తెలిపారు. ఏడాదిన్నర కాలంలో ఈ ప్రాంతం అనూహ్య రీతిలో అభివృద్ధి చెందుతుందని అర్వింద్ కుమార్ వివరించారు. రెండో దశలో ఏడు ల్యాండ్ పార్సిళ్లను ఆన్లైన్ వేలం ప్రక్రియ ద్వారా విక్రయిస్తామన్నారు. 45.33 ఎకరాల విస్తీర్ణంలోని ఈ సైట్లో ఒక్కో ప్లాట్ 3.60 ఎకరాల నుంచి 9.71 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుందని తెలిపారు. హైదరాబాద్ నగరం శరవేగంగా అభివృద్ధి చెందుతున్నదని, ప్రణాళికాబద్ధంగా మౌలిక సదుపాయాలు అందుబాటులోకి వస్తున్నాయన్నారు.
గత కొన్ని సంవత్సరాలుగా హైదరాబాద్ నగరంలో జరిగిన అభివృద్ధి కళ్లెదుటనే ఉందన్నారు. మల్టీఫుల్ యూజ్ జోన్ పరిధిలో ఉన్న ఈ నియోపోలిస్ లే అవుట్‌కు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయన్నారు. సముద్ర మట్టానికి 588 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ లే అవుట్ కోసం 41 ఎకరాలను ఎమినిటీస్ కోసం కేటాయించిందన్నారు. వాస్తు ప్రమాణాలకు లోబడి ప్రతి ప్లాట్‌కు నార్త్ ఫేస్ ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకున్నామని డెవలపర్లు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పారు. ఈ ప్రీ బిడ్ సమావేశానికి 50కి పైగా బడా రియల్ ఎస్టేట్ సంస్థల ప్రతినిధులు హాజరు కాగా, ప్రీ బిడ్ సమావేశానికి హాజరు కాలేని జాతీయ, అంతర్జాతీయ రియల్ ఎస్టేట్ సంస్థల ప్రతినిధుల కోసం హెచ్ఎండీఏ ఉన్నతాధికారులు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు జూమ్ మీటింగ్ నిర్వహించినట్లుగా తెలిపారు. ప్రీ బిడ్ సమావేశంలో ఎంఎస్టీసీ ప్రతినిధులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వగా, హెచ్ఎండీఏ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డి, సెక్రటరీ పి. చంద్రయ్య, డైరెక్టర్ విద్యాధర్, చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ ఎస్కే మీరా, చీఫ్ అకౌంట్ ఆఫీసర్ విజయలక్ష్మి, ఓఎస్డీ రాం కిషన్ తదితరులు పాల్గొన్నారు.