సిటీబ్యూరో, సెప్టెంబర్ 6(నమస్తే తెలంగాణ) : రూ. 150 కోట్ల రూపాయల సేకరణే లక్ష్యంగా విలువైన భూముల వేలానికి హెచ్ఎండీఏ సన్నాహాలు చేసింది. ఈ మేరకు తొలి దఫా సెప్టెంబర్ 3న భూముల వేలం నిర్వహించింది. రెండో దఫాలో ఏకంగా 7810 గజాల భూమిని సిద్ధం చేసింది. సరూర్ నగర్, కూకట్పల్లి హైదర్ నగర్ ప్రాంతంలోని రెండు ల్యాండ్ పార్సిళ్లను విక్రయించనుండగా, వీటి ద్వారా కనీసం రూ. 150 కోట్లు అర్జించాలనే లక్ష్యంతో ఈ వేలం నిర్వహించనున్నది.
హైదరాబాద్ కేంద్రం విలువైన భూములను విక్రయించి, సొమ్ము చేసుకోవడమే లక్ష్యంగా కాంగ్రెస్ సర్కారు వ్యవహరిస్తోంది. ఈ క్రమంలో హెచ్ఎండీఏ ఆధ్వర్యంలోనే ఇప్పటివరకు 5 దశలుగా భూముల వేలం నిర్వహించింది. అయితే తాజాగా నిధుల సమీకరణలో కీలకమైన ఈ భూముల వేలాన్ని మరోసారి చేపట్టింది. సెప్టెంబర్ 3న నిర్వహించిన భూముల వేలం ద్వారా అత్తెసరు ఆదాయమే వచ్చింది. దీంతో రెండో దఫాగా నిర్వహించి సరూర్ నగర్, హైదర్ నగర్ భూముల వేలంపై హెచ్ఎండీఏ గంపెడాశలు పెట్టుకున్నది. వీటి ద్వారా వచ్చే ఆదాయంతోనే కోకాపేట్, గోల్డెన మైల్ వెంచర్‌లోని ప్లాట్ల ఆదరణ ఆధారపడి ఉందని భావిస్తున్నారు.
సరూర్ నగర్‌లోని పాత కోర్టు ప్రాంగణాన్ని మార్కెట్లోకి తీసుకువచ్చిన హెచ్ఎండీఏ, తొలుత ఇక్క భారీ కమర్షియల్ కాంప్లెక్స్ కట్టాలనే ప్రతిపాదనలు చేసింది. కానీ కొత్తగా వచ్చిన హెచ్ఎండీఏ అధికారులు ఆ ప్రతిపాదనలను పక్కనపెట్టి, భూములను విక్రయించాలని ఉన్నతాధికారులకు సూచించినట్లు తెలిసింది. ఈ క్రమంలో చదరపు గజానికి రూ. 1.50లక్షల చొప్పున మొత్తం 4356 చదరపు గజాల విస్తీర్ణంలో ఉన్న ల్యాండ్ పార్సిల్‌ను వేలానికి పెట్టింది.
వీటిపై సగటున రూ. 100-110 కోట్లు ఆర్జించాలనే లక్ష్యంతో అధికారులు అంచనా వేస్తున్నారు. రెండో దఫాగా జరుగుతున్న ఈ వేలంలో సరూర్ నగర్ పార్సిల్ హాట్ కేకులా మారిందంటున్నారు. ఇక కూకట్ పల్లిలోని హైదర్ నగర్ లో ఉన్న భూమికి 3454 చదరపు గజాల స్థలానికి కనీస ధరగా రూ. 95వేలుతో నిర్ణయించింది. వీటి ద్వారా మరో రూ. 30-40 కోట్లు అంచనా వేస్తోంది.