సిటీబ్యూరో, జూన్ 14(నమస్తే తెలంగాణ) : భవన నిర్మాణాల సరళీకృత విధానాల పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామాల్లోని రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని ప్రభావితం చేసేలా యూనిఫైడ్ డెవలప్మెంట్ అండ్ బిల్డింగ్ కోడ్ను వర్తింపజేయాలని భావిస్తున్నది. దీని ద్వారా హెచ్ఎండీఏ తరహాలోనే గ్రామాల్లోనూ భవన నిర్మాణ అనుమతులు అమల్లోకి రానున్నాయి. హైదరాబాద్ తరహాలో గ్రామాల వరకు ఏకరీతి నిర్మాణాల రూపకల్పనకు హెచ్ఎండీఏ ప్రధాన ఏజెన్సీగా వ్యవహరిస్తూ మార్గదర్శకాలకు కసరత్తు చేస్తున్నది. ఇదే కనుక జరిగితే… రాజధాని చుట్టూరా ఉన్న 11 జిల్లాలకే పరిమితమైన హెచ్ఎండీఏ నిబంధనలు… అన్ని గ్రామాలకు వర్తిస్తాయి. ఇందుకు హెచ్ఎండీఏ ఓ కన్సల్టెన్సీ సాయంతో కసరత్తు చేస్తుండగా, సమగ్ర అధ్యయనం తర్వాత తెలంగాణ వ్యాప్తంగా యూనిఫైడ్ డెవలప్మెంట్ అండ్ బిల్డింగ్ కోడ్ అమల్లోకి రానున్నది.
ఏకరీతి భవన నిర్మాణాల పేరిట ఉన్న విధానాల్లో మార్పులు చేసేందుకు సిద్ధమవుతున్నది కాంగ్రెస్ సర్కారు. రాష్ట్ర స్థాయిలో ఏకరీతి భవన నిర్మాణ విధానాలను రూపొందించే బాధ్యతను హెచ్ఎండీఏకు అప్పగించింది. దీనికి కన్సల్టెన్సీ సాయంతో యూనిఫైడ్ డెవలప్మెంట్ అండ్ బిల్డింగ్ కోడ్ కోసం హెచ్ఎండీఏ చర్యలు చేపట్టింది. దీంతో ప్రస్తుతం వేర్వేరుగా ఉన్న డీటీసీపీ, హెచ్ఎండీఏ అనుమతుల విధానం ఒకే తీరుగా ఉండనున్నది. ప్రస్తుతం హెచ్ఎండీఏ, డీటీసీపీ నిబంధనలతో అభివృద్ధి చేసిన వెంచర్లలో వేర్వేరు ధరల్లో భారీ వ్యత్యాసమే ఉంటుంది. కానీ ఒకే రీతి భవన నిర్మాణ అనుమతులతో ఓపెన్ స్పేస్, సెట్ బ్యాక్, రోడ్లు వంటి మౌలిక వసతుల విషయంలో చిన్న వెంచర్లు కూడా హెచ్ఎండీఏ తరహాలో ఓపెన్ స్పేస్, అంతర్గత రోడ్లు, సెట్ బ్యాక్, పార్కింగ్ వంటి అంశాలను పరిగణనలోకి తీసుకునే భవన నిర్మాణ అనుమతులను మంజూరవుతాయి.
ప్రస్తుతం అమల్లో ఉన్న భవన నిర్మాణ అనుమతులతోనే గడిచిన పదేండ్లలో యావత్ తెలంగాణ వ్యాప్తంగా వ్యవసాయ రంగానికి ధీటుగా రియల్ ఎస్టేట్ రంగం దూసుకుపోయింది. హైదరాబాద్ కేంద్రంగా అమ్ముడుపోయిన ఎకరం రికార్డు స్థాయి ధరలతో… గ్రామాలకు రియల్ బూమ్ చేరింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సింగిల్ విండో విధానంలో టీఎస్ బీపాస్ వంటి సంస్కరణలతో అనుమతుల విధానమే మారిపోయింది.
నిర్మాణ రంగాన్ని ఒకే గొడుగు తీసుకువస్తూ కావాల్సిన విధానాలను సమర్థవంతంగా అమలు చేశారు. కానీ అధికారంలోకి రావడంతోనే టీఎస్ బీపాస్ స్థానంలో బిల్డ్ నౌ తీసుకువస్తామని చెప్పింది కాంగ్రెస్ సర్కారు. ఆ ఫలితాలను ఇప్పుడు నిర్మాణ రంగం ఎదుర్కొంటూనే ఉంది. ఇప్పటికీ బిల్డ్ నౌ హెచ్ఎండీఏ పరిధిలో పూర్తి స్థాయిలో అమల్లోకి రాలేదు. కాగా, కన్సల్టెన్సీ చేపట్టే అధ్యయనం ద్వారా ఏకరీతి భవన నిర్మాణ విధివిధానాలతో నిర్మాణ రంగానికి ఒరిగే ప్రయోజనం ఎంత వరకు అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది.